
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా అతని అభిమానగణం చెక్కు చెదరలేదు. అత్యుత్తమ సారథిగా.. గొప్ప వికెట్ కీపర్‌గా.. బెస్ట్ ఫినిషర్‌గా.. క్రికెట్ చరిత్రలో మహీ చెరగని ముద్ర వేశాడు. కేవలం ఆటతోనే కాకుండా.. సహచర క్రికెటర్లు, ఇతర జట్ల ఆటగాళ్లతో తను వ్యవహరించే తీరుతో కూడా ఈ జార్ఖండ్ డైనమైట్ కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్నాడు. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మహీకి అభిమానులున్నారు. ఇతర దేశ ఆటగాళ్లు సైతం మహీని ఆరాధిస్తుంటారు. ఈ క్రమంలోనే అతనితో ఒక్కసారి మాట్లాడిన చాలు అనుకుంటారు. ఐపీఎల్ 2020, 2021 సీజన్ సందర్భంగా ఇలాంటి సన్నివేశాలను మనమెన్నో చూశాం.
ధోనీ కెరీర్ తుది దశకు చేరిన దశలో చివరి సీజన్ భావించిన ఆటగాళ్లంతా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ ముగిసిన వెంటనే ధోనీ దగ్గరికి పరుగెత్తారు. అతనితో మాట్లాడుతూ జెర్సీలపై ఆటోగ్రాఫ్ తీసుకుంటూ ఫొటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇక పాకిస్థాన్ పేసర్ హరిస్ రౌఫ్‌కు కూడా ధోనీ అంటే పిచ్చి. ఈ క్రమంలోనే అతను టీ20 ప్రపంచకప్ సందర్భంగా టీమిండియాకు మెంటార్‌గా వ్యవహరించిన ధోనీని కలిసాడు. తనకు చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ కావాలని కోరాడు. అప్పుడు భారత జట్టుతో ఉండటంతో మహీ తర్వాత పంపిస్తానని మాట ఇచ్చాడు.
ఈ మాట ప్రకారం సంతకం చేసిన తన జెర్సీని హరిస్ రౌఫ్‌కు ధోనీ తాజాగా పంపించాడు. ఈ విషయాన్ని హరిస్ రౌఫ్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 'దిగ్గజం.. కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ ఈ అందమైన బహుమతిని నాకు పంపించాడు. తన షర్టు ఇది. తన మంచి మనసుతో నెంబర్ '7' ఇంకా హృదయాలను కొల్లగొడుతూనే ఉన్నాడు'' అంటూ రౌఫ్ ధోనీ పంపించిన జెర్సీతో ట్వీట్ చేశాడు. అలాగే తనకు ఈ గిఫ్ట్ అందడంలో సహకరించిన సీఎస్కే జట్టు మేనేజర్ రసెల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడు. తమ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మాటిస్తే కచ్చితంగా నిలబెట్టుకుంటాడని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేనేజర్ రసెల్ రాధాకృష్ణన్ తెలిపాడు.