న్యూఢిల్లీ: అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడంతో పాటు జట్టుకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దుకుంటేనే విజయాలు దక్కుతాయని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు కోసం ఆడటమే ముఖ్యమని, ఈ రెండు అంశాలే తమ టీమ్ సక్సెస్‌కు కారణమని ధోనీ తెలిపాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 77 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ విజయంతో ప్లే ఆఫ్స్‌కు చేరిన చెన్నై సూపర్ కింగ్స్.. క్వాలిఫయర్-1కు కూడా అర్హత సాధించింది. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 14 సీజన్లు ఆడిన చెన్నై.. 12 సార్లు ప్లే ఆఫ్స్ చేరింది. గతేడాది 9వ స్థానంలో నిలిచిన చెన్నై.. ఈ సారి రెండో స్థానాన్ని అందుకుంది. ఈ విజయానంతరం మాట్లాడిన ధోనీ.. ఈ సక్సెస్.. టీమ్ ప్లేయర్లతో పాటు సహాయక సిబ్బంది కష్టమని తెలిపాడు.

'సక్సెస్‌కు ఎలాంటి రెసిపీలు ఉండవు. అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడంతో పాటు వారికి బెస్ట్ స్లాట్స్ ఇచ్చి అద్భుత ప్రదర్శన కనబర్చేలా చేయాలి. ఆయా ప్లేస్‌లో సెట్ కాకపోతే వారిని జట్టుకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. జట్టు కోసం కొందరు తమ ప్లేస్‌లను త్యాగం కూడా చేయాల్సి ఉంటుంది. మా సక్సెస్ క్రెడిట్ టీమ్ మేనేజ్‌మెంట్‌దే. వాళ్లు ఎప్పుడూ మాకు అండగా నిలిచారు.
అయితే ఆటగాళ్లు కూడా చాలా ముఖ్యమే. ప్లేయర్లు లేకుండా మనమేం చేయలేం. డెత్ ఓవర్లలో ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేయడం చాలా ముఖ్యం. తుషార్ తన బౌలింగ్‌ను చాలా డెవలప్ చేసుకున్నాడు. ఒత్తిడిలో కూడా అద్భుతంగా బౌలింగ్ చేయడం నేర్చుకున్నాడు. ప్రస్తుతం అతను ఆత్మవిశ్వాసంగా ఉన్నాడు.
ఎక్కువ మార్పులు చేయకుండా సేమ్ ప్లేయర్లను కొనసాగిస్తేనే ఇది సాధ్యమవుతోంది. బౌలర్లు కూడా తమ బాధ్యతలను పంచుకున్నారు. పతీరణ సహజంగానే డెత్ బౌలర్. కానీ తుషార్ దేశ్‌పాండే నేర్చుకున్నాడు. టీమ్ కోసం ఆడే ఆటగాళ్లనే ఎంచుకోవాలి. వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు కోసం ఆడటమే చాలా ముఖ్యం. ముఖ్యంగా నాకౌట్ గేమ్స్‌లో ఇలానే ఆడాలి.
బయటి నుంచి ఆటగాళ్ల సత్తాను అంచనా వేయడం చాలా కష్టం. ఆడితేనే వారి గురించి తెలుస్తోంది. 10 శాతమే రాణిస్తున్నప్పుడు జట్టు కోసం 50 శాతం ఇచ్చేలా తీర్చిదిద్దాలి.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 223 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 79), డేవాన్ కాన్వే( 52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87 )విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
శివమ్ దూబే(9 బంతుల్లో 3 సిక్స్‌లతో 22), రవీంద్ర జడేజా(7 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 20 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్జ్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్(58 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 86) ఒక్కడే హాఫ్ సెంచరీతో పోరాడగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ మూడు వికెట్లు తీయగా.. మహీశ్ తీక్షణ, పతీరణ రెండేసి వికెట్లు పడగొట్టారు. తుషార్ దేశ్‌పాండే, జడేజాకు తలో వికెట్ దక్కింది.