సోషల్ మీడియా, పబ్లిక్ రిలేషన్స్(పీఆర్) ప్రచారాలపై టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాగా ఆడితే ఎలాంటి పీఆర్ అవసరం లేదన్నాడు. అనామక ఆటగాడిగా భారత క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన ధోనీ అసాధారణ ప్రదర్శనతో టీమిండియా కెప్టెన్‌గా ఎదిగాడు.
తన సారథ్యంలో భారత్‌ను మూడు సార్లు విశ్వవిజేతగా నిలబెట్టి ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ధోనీ సారథ్యంలోనే టీమిండియా గెలుచుకుంది. దాంతోనే ధోనీకి విపరీతమైన పాపులారిటీ సొంతమైంది.

ప్రపంచవ్యాప్తంగా అతనికి అభిమానులు ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఐదేళ్లు అవుతున్నా అతని చరిష్మా తగ్గడం లేదు. కేవలం ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్న ధోనీ బ్రాండ్ వాల్యూ కోహ్లీతో సమంగా ఉంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ధోనీని పీఆర్ మేనేజ్‌మెంట్ గురించి ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేనెప్పుడూ సోషల్ మీడియాకు పెద్ద అభిమానిని కాదు. 2004లో నేను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాను. ఆ సమయంలో ట్విటర్ అప్పుడప్పడే పాపులర్ అవుతోంది.
ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ వచ్చింది. మనం కూడా పీఆర్ క్యాంపెయిన్ చేద్దామని నా మేనేజర్లంతా చెప్పేవారు. అయితే నేను వద్దన్నాను. నేను క్రికెట్ బాగా ఆడితే ఎలాంటి పీఆర్ అవసరం రాదాని వారికి చెప్పాను.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.
సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈతరంలో ప్రతీ ఒక్కరు పీఆర్ మేనేజ్‌మెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీ, క్రికెట్ సెలెబ్రిటీలు తమ పాపులారిటీని పెంచుకోవడానికి పీఆర్‌లను నియమించుకుంటున్నారు. సెలెబ్రిటీలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా, మీడియా వేదికగా ప్రచారం చేయడమే పీఆర్‌ల పని.
2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఫస్ట్ మ్యాచ్‌లోనే ధోనీ డకౌటయ్యాడు. వైజాగ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన వన్డేలో విధ్వంసకర శతకంతో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఆ క్షణం నుంచి ధోనీ వెనుదిరిగి చూసుకోలేదు. 2019 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో చివరి మ్యాచ్ ఆడాడు. యాదృశ్చికమో ఏమో కానీ ఆ మ్యాచ్‌లో కూడా ధోనీ రనౌటయ్యాడు. 2020 ఆగస్ట్ 15న ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అప్పటి నుంచి కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు.