అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా.. స్కూల్ పిల్లాడిలా ఆటను ఆస్వాదిస్తున్నానని టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. చిన్నప్పుడు అయితే ఎలా ఇష్టంగా ఆడానో.. ఇప్పుడు అలానే ఆటను ఎంజాయ్ చేస్తున్నానని తెలిపాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో చివరి సారిగా ఆడిన ధోనీ 2020 ఆగస్ట్ 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అప్పటి నుంచి ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. అయితే ప్రతీ ఐపీఎల్ సీజన్ ముంగిట అతని రిటైర్మెంట్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది.
ఆటను ఆస్వాదిస్తున్నాను..
ధోనీ మాత్రం గత ఐదేళ్లుగా ప్రతీ సీజన్ ఆడి అభిమానులను అలరిచాడు. ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా జట్టును విజేతగా కూడా నిలబెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఐదేళ్లు కావడంతో ఈ సారి అనామక ఆటగాడిగా ఐపీఎల్ బరిలోకి దిగుతున్నాడు. తాజాగా ఓ యాప్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీని రిటైర్మెంట్ ప్రణాళికల గురించి ప్రశ్నించగా.. మరోసారి సమాధానం దాటవేసాడు. రిటైర్మెంట్ ఎప్పుడు? అనే విషయంపై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. క్రికెట్‌ను ఆస్వాదించాలనుకుంటున్నానని తెలిపాడు.

స్కూల్ పిల్లాడిలా...
'నేను 2019లో రిటైర్ అయ్యాను. ఇది జరిగి 6 ఏళ్లు అవుతోంది. ఇప్పటికీ నేను ఆటను ఆస్వాదిస్తున్నాను. స్కూల్ రోజుల్లో ఎలాగైతే ఆటను ఆస్వాదించానో ఇప్పుడు అలానే ఆటను ఎంజాయ్ చేస్తున్నాను. నా చిన్నప్పుడు సాయంత్రం 4 గంటలకు స్పోర్ట్స్ బ్రేక్ ఉండేది. అప్పుడు మేం క్రికెట్ ఆడేవాళ్లం. వాతావరణం అనుకూలించకపోతే ఫుట్ బాల్ ఆడేవాళ్లం. చిన్నప్పుడు ఆట కోసం ఎంత తపించేవాడినో.. ఇప్పుడు కూడా అంతే ఇష్టంతో ఆడుతున్నాను.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.
ఆటపైనే ఫోకస్ పెట్టాలి..
టీమిండియాకు ఆడుతున్నప్పుడు యువ ఆటగాళ్ల ఫోకస్ సరిగ్గా ఉండాలని ధోనీ అభిప్రాయపడ్దాడు.'నేను టీమిండియాకు ఆడే సమయంలో ఆటపైనే పూర్తిగా ఫోకస్ పెట్టేవాడిని. ఆట తప్పా నాకు ఏది ముఖ్యంగా ఉండేది కాదు. ఒక ఆటగాడిగా భారత్ తరఫున మెరుగైన ప్రదర్శన చేయాలని పరితపించేవాడిని. ఎందుకంటే దేశం తరఫున ఆడే అవకాశం అందరికీ రాదు. దేశం తరఫున ఆడుతున్నప్పుడు ఎంతో ఒత్తిడి ఉంటుంది. ప్రతీ మ్యాచ్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నించాను.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.