నేను మ్యాథ్స్‌లో వీక్ సర్.. ఆ ప్లే ఆఫ్స్ లెక్కలు నాకు తెల్వద్: ధోనీ

ముంబై: తమ జట్టు ప్లే ఆఫ్స్ చేరడం గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదని చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. ఈ లెక్కలంటే తనకు ఇష్టం ఉండదని, చిన్నప్పుడు స్కూల్లోనూ మ్యాథ్స్‌లో వెనకబడిపోయానని ధోనీ చమత్కరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ 91 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
ఈ విజయానంతరం మాట్లాడిన ధోనీని.. ప్లే ఆఫ్స్ అవకాశాలపై దృష్టిసారించారా? అని హోస్ట్ ప్రశ్నించగా.. తనదైనశైలిలో బదులిచ్చాడు. ప్లే ఆఫ్స్‌తో తమకు అనవసరమని, మిగిలిన లీగ్‌ను వీలైనంత మేరకు ఆస్వాదించడమే తమ లక్ష్యమని ధోనీ చెప్పుకొచ్చాడు. ఇలాంటి విజయాలు టోర్నీ ఆరంభంలోనే రావాల్సిందని అభిప్రాయపడ్డాడు.

ముందే గెలవాల్సింది..
'ఇలాంటి విజయాలు ముందే వచ్చి ఉంటే బాగుండేది. ఇదో గొప్ప మ్యాచ్. మా బ్యాటర్లు బాగా ఆడారు. మిగతావారు ఏదో ఒక విధంగా రాణించారు. మ్యాచ్ గెలవాలంటే స్కోర్‌బోర్డుపై భారీ లక్ష్యం నిర్దేశించడం చాలా ముఖ్యం. అలాగే ఢిల్లీ జట్టులోని బిగ్ హిట్టర్లను పరుగులు చేయకుండా పెవిలియన్ చేర్చాలి. ముఖేశ్ చౌదరి, సిమర్జీత్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. మ్యాచ్‌లు ఆడేకొద్దీ వారు మరింత మెరుగవుతున్నారు. ఇక నా బ్యాటింగ్ విషయానికొస్తే క్రీజులోకి వెళ్లిన వెంటనే ఎడాపెడా బాదాలనుకోను. కానీ, ఈరోజు తక్కువ బంతులే మిగిలి ఉండటంతో ధాటిగా ఆడాల్సి వచ్చింది.

లెక్కలు నచ్చవ్..
అలాగే మేం ప్లేఆఫ్స్ చేరతామా? లేదా? అనే లెక్కలు వేసుకోవడం లేదు. నాకు లెక్కలంటే అస్సలు నచ్చవ్. చిన్నప్పుడు స్కూల్లోనూ మాథ్స్‌లో నేను వీక్. ఇప్పుడు నెట్ రన్‌రేట్ గురించి ఆలోచిస్తే ఉపయోగం లేదు. ఐపీఎల్ 2022ని ఆస్వాదించాలంటే. తర్వాతి గేమ్‌లో ఎలా ఆడాలనేదాని గురించే ఆలోచించాలి. ఒకవేళ మేం ప్లేఆఫ్స్ చేరితే మంచిదే. వెళ్లకపోయినా పోయేదేం లేదు. దీంతో ప్రపంచం ఏం ఆగిపోదు కదా?' అని ధోనీ పేర్కొన్నాడు.

చెన్నై ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
చెన్నై 11 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి ఇంకా టెక్నికల్‌గా ప్లేఆఫ్స్ రేసులో కొనసాగుతోంది. అయితే, అదంత సులువైన పని కాదు. చెన్నై టాప్-4లో నిలవాలంటే మిగతా జట్లు భారీ ఓటములు చవిచూడటంతో పాటు చెన్నై ఇకపై ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లోనూ గొప్ప విజయాలు నమోదు చేయాలి. చెన్నై తదుపరి మ్యాచ్‌ల్లో ముంబై, గుజరాత్, రాజస్థాన్‌లతో తలపడనుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు నమోదు చేయడంతో పాటు ఆర్‌సీబీ, ఢిల్లీ, పంజాబ్, సన్‌రైజర్స్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా ఓడిపోవాలి. అప్పుడు మెరుగైన రన్‌రేట్‌తో చెన్నై ప్లే ఆఫ్స్ చేరొచ్చు. కానీ ఇది అసాధ్యం.

ఢిల్లీ చిత్తుగా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(49 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 87) భారీ ఇన్నింగ్స్ ఆడగా.. ధోనీ (8 బంతుల్లో 2 సిక్స్‌లు, ఫోర్‌తో 21 నాటౌట్) సూపర్ ఫినిష్ అందించాడు. ఈ ఇద్దరి విధ్వంసానికి తోడుగా రుతురాజ్ గైక్వాడ్(33 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 41), శివమ్ దూబే(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ మూడు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ మార్ష్‌కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ.. 17.4 ఓవర్లలో 117 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. మిచెల్ మార్ష్(25), రిషభ్ పంత్(21), శార్దూల్ ఠాకూర్(24), డేవిడ్ వార్నర్(19) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. చెన్నై బౌలర్లలో మోయిన్ అలీ మూడు వికెట్లు తీయగా.. ముఖేష్ చౌదరి, సిమర్జీత్ సింగ్, డ్వేన్ బ్రావో రెండేసి వికెట్లు తీసారు. మహీశ్ తీక్షణ ఓ వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications