
ముంబై: సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజు ( 2011 ఏప్రిల్ 2) యావత్ భారతావని సంతోషంతో సంబరాలు జరుపుకుంది. 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా శ్రీలంకతో జరిగిన ఈ మెగా ఫైనల్లో భారత్ 6 వికెట్లతో గెలుపొంది అద్భుత విజయాన్నందుకుంది. ఇక ఈ మ్యాచ్‌ను నాటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ విన్నింగ్ షాట్‌తో ముగించడం ఈ మెగాటోర్నీకే హైలైట్. అయితే ఈ అద్భుత విజయాన్నందుకొని పదేళ్లు పూర్తయిన సందర్భంగా గల్ఫ్ ఆయిల్ ఓ ఆసక్తికర వీడియోను రూపొందించింది.
విచిత్రం ఏంటంటే ఇందులో ప్రశ్నలు అడిగేవారు.. సమాధానాలు చెప్పేవారు ఒక్కరే. అంటే 2005 ఎంఎస్ ధోనీని 2021 ఎంఎస్ ధోనీ ఇంటర్వ్యూ చేశాడన్నమాట. నాలుగు నిమిషాల నిడివిగల ఈ వీడియోలో మహీ అటు జూనియర్‌గా.. ఇటు సీనియర్‌గా అద్భుతమైన హావభావాలు పలికించాడు. ఈ వీడియోను గల్ఫ్ ఆయిల్ సంస్థ యూట్యూబ్ వేదికగా అప్‌లోడ్ చేయగా.. నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
2021 మహీ పూర్తి ఆత్మవిశ్వాసంతో కుర్చీలో కూర్చొన్నాడు. 2005 మహీ మాత్రం కాస్త బెరుకుగా కుర్చీలో ముందుకు జరిగి కూర్చోవడం గమనార్హం. అతడికి మైక్ పెట్టిన సహాయకురాలికి ధన్యవాదాలు చెబుతూ కనిపించాడు. 'అరంగేట్రం చేసిన ఏడాదిలోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకున్నావు. అభినందనలు' అని 2021 ధోనీ అనడంతో 2005 మహీ ధన్యవాదాలు సర్ అని బదులిచ్చాడు. 'అంతేకాదు.. శ్రీలంకపై 183 పరుగులు.. అదీ 50 ఓవర్లు కీపింగ్ చేసి 46 ఓవర్లు బ్యాటింగ్ చేయడం తేలికేం కాదు' అని సీనియర్ అంటే.. 'సర్.. మీకు తెలియంది కాదు. వికెట్ ఫ్లాట్‌గా ఉంది. వేర్వేరు పరిస్థితులు, పిచ్‌లపై నిలకడగా ఆడుతుంటే ఇవన్నీ సాధ్యమే' అని జూనియర్ హుందాగా బదులిచ్చాడు.
'సర్.. మీరెన్నో వన్డేలు, టెస్టులు ఆడారు. మీకిష్టమైన ఇన్నింగ్స్ ఏంటి' అని జూనియర్ మహీ ప్రశ్నించగా... 2011 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై చేసిన 91 పరుగుల ఇన్నింగ్సే తన ఆల్‌టైమ్ ఫేవరెట్ అని సీనియర్ ధోనీ బదులిస్తాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో టీమిండియాను రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టినప్పుడు లభించిన ఆ మజానే వేరని చెప్తాడు. నువ్వు ఇంకొక త్యాగం చేయాలి. బటర్ చికెన్, శీతల పానీయాలు, మిల్క్ షేక్‌లంటే ఇష్టం కదా. మెల్లగా వాటినీ వదిలేయాలి' అని 2021 మహీ చెప్పాడు. 'సర్.. నిలకడగా బాగా ఆడుతున్నా అన్ని ఇష్టాల్నీ త్యాగం చేయాలా' అని జూనియర్ ప్రశ్నిస్తే 'అవసరం లేదు.. బైకింగ్‌ను మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దు' అని సీనియర్ ముగించాడు. ధోనీ vs ధోనీగా సాగే ఈ వీడియో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.