
రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తల్లిదండ్రులు కరోనా వైరస్‌ను జయించారు. గత బుధవారం (ఏప్రిల్ 21న) మహీ తల్లి దేవకీ దేవి, తండ్రి పాన్ సింగ్‌లకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటీవ్ వచ్చిన విషయం తెలిసిందే. దాంతో వారిని రాంచీలోని పల్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఇక వారం అనంతరం మరోసారి వారికి పరీక్షలు నిర్వహించగా నెగటీవ్ వచ్చింది. దాంతో వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఇక ధోనీ తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితిని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఎప్పటికప్పుడు మానిటర్ చేసింది. ఈ విషయాన్ని ఆ టీమ్ చీఫ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగే తెలిపాడు. మహీ తల్లిదండ్రులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుందన్నాడు. 'ధోనీ పేరేంట్స్ హెల్త్ కంట్రోల్‌లోనే ఉంది. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. మేనేజ్‌మెంట్ కూడా అన్ని చర్యలు చేపట్టింది. మహీ ఫ్యామిలీకి కావాల్సిన సపోర్ట్‌ను అందిస్తున్నది. రాబోయే రోజుల్లో కూడా వాళ్లను జాగ్రత్తగా చూసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది'అని ఫ్లేమింగ్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2021 సీజన్‌లో ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ దుమ్ములేపుతోంది. ఇప్పటికే 5 మ్యాచ్‌ల్లో 4 గెలిచిన ధోనీ సేన.. మరికొద్ది సేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది.