
న్యూఢిల్లీ: వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్‌కు తాను బౌలింగ్ చేయకపోవడమే ఉత్తమమని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సూచించాడని లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ తెలిపాడు. మహీ ఇచ్చిన చిట్కాతోనే ఐపీఎల్‌లో యూనివర్స్ బాస్‌ను ఔట్ చేశానని కూడా గుర్తు చేసుకున్నాడు. 2017-2018 సీజన్‌లో విజయ్ హజారే ట్రోఫీ సందర్భంగా ధోనీని కలిసానని తెలిపిన నదీమ్.. అప్పుడు గేల్‌కు బౌలింగ్ చేయాల్సి వస్తే ఎలా వేయాలని అడిగినట్లు ఆకాశ్‌చోప్రా యూట్యూబ్ ఛానెల్లో చెప్పాడు.
'నేను మళ్లీ చైనామన్ బౌలర్‌గా ఎందుకు మారానంటే, ఐపీఎల్‌లో ఎప్పుడూ క్రిస్ గేల్‌కు బౌలింగ్ చేయలేదు. అలాగే లెఫ్టార్మ్ స్పిన్నర్లపై అతడు చెలరేగుతాడని చాలా మంది అన్నారు. దాంతో నా మెదడులో అదే ఉండిపోయింది. అతడికి బౌలింగ్ చేయాల్సి వస్తే ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించేవాడిని. ఈ నేపథ్యంలోనే అతడికి చైనామన్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నా.
విండీస్ ఓపెనర్ గురించి ఆలోచిస్తూనే రెండేళ్లు ఆ బౌలింగ్‌పై సాధన చేశా. ఇక 2017-18 సీజన్‌లో విజయ్ హాజారే ట్రోఫీ సందర్భంగా ధోనీ భాయ్‌ని కలిసినప్పుడు గేల్‌కు ఎలా బౌలింగ్ చేయాలని అడిగా. దానికి మహీ భాయ్.. 'అసలు నువ్వు గేల్‌కు బౌలింగ్ చేయకపోవడమే ఉత్తమం. ఒకవేళ చేయాల్సి వచ్చినా అతడి పరిధిలో బంతిని వేయకుండా.. దూరంగా వెయ్ లేకపోతే అతడి ప్యాడ్లకు దగ్గరగా వెయ్. అలా బంతులేస్తే గేల్ సింగిల్స్ తీస్తాడు' అని చెప్పాడని నదీమ్ గుర్తుచేసుకున్నాడు. అయితే ధోనీ చెప్పినట్టే చేసి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగిన గేల్‌ను ఔట్ చేశానని నదీమ్ చెప్పుకొచ్చాడు.