
రాంచీ: ఐపీఎల్ 2020 సీజన్ జరగకున్నా టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ టీ20 ప్రపంచకప్ ఆడుతాడని అతని కోచ్ కేశవ్ రంజన్ బెనర్జీ అభిప్రాయపడ్డాడు. అదే అతనికి ఆఖరి టోర్నీ అవుతుందని కూడా జోస్యం చెప్పాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కు దూరమైన ధోనీ.. ఐపీఎల్ 2020 సీజన్‌తో రీ ఎంట్రీ ఇవ్వాలని భావించాడు. అక్కడ రాణిస్తే ధోనీ భారత జట్టులోకి వస్తాడని అందరూ భావించారు.
కానీ.. మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్‌ను బీసీసీఐ కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్ 15 వరకూ వాయిదావేసిన విషయం తెలిసిందే. అయితే.. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఈ మెగా టోర్నీ జరగడం కష్టంగానే ఉంది. పూర్తిగా రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది అక్టోబర్‌లో టీ20 వరల్డ్‌కప్ జరగనుండగా.. ఐపీఎల్ 2020 సీజన్ తర్వాతే భారత జట్టుపై ఓ స్పష్టత వస్తుందని ఇటీవల టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి వెల్లడించాడు. ఈ క్రమంలోనే ధోనీ భవితవ్యం కూడా ఐపీఎల్‌లో రాణించడంపైనే ఆధారపడి ఉందని తెలిపాడు. కానీ.. ఇప్పుడు ఐపీఎల్ రద్దయితే ధోనీ భవిష్యత్ ఏంటి..? అనే సందేహం అందరిలోనూ నెలకొంది. అయితే.. ఐపీఎల్ రద్దయినా.. ధోనీకి వరల్డ్‌కప్‌లో అవకాశం దొరుకుతుందని కోచ్ బెనర్జీ చెప్పుకొచ్చాడు.
'ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ జరగడం అనుమానంగానే కనిపిస్తోంది. అయితే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకునే అంతిమ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. ఒకవేళ ఐపీఎల్ రద్దయితే..? కెరీర్ పరంగా ధోనీ ఇబ్బందుల్లో పడతాడు. కానీ.. నా సిక్త్స్ సెన్స్ ప్రకారం.. ధోనీకి టీ20 వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశం దొరుకుతుంది. అదే అతనికి చివరి టోర్నీ అయ్యే అవకాశం ఉంది'అని బెనర్జీ చెప్పుకొచ్చాడు.