సౌతిండియాలో సూపర్ స్టార్ రజినీకాంత్‌తో పాటు సూర్య అంటే తనకు చాలా ఇష్టమని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. సమయం దొరికితే వారి సినిమాలు చూస్తానని చెప్పాడు. గతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ.. ఫేవరేట్ హీరోలకు గురించి ప్రశ్నించగా ఈ వ్యాఖ్యలు చేశాడు. సూర్యకు చెందిన సింగమ్ మూవీని సబ్‌టైటిల్స్‌తో చూశానని, బాగా నచ్చిందని కూడా ధోనీ చెప్పాడు.
రజినీకాంత్ అంటే తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమని ధోనీ అనేక ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. రజినీకాంత్‌కు తాను డైహార్డ్ ఫ్యాన్ అని, ఆయన సినిమాలు చిన్నప్పటి నుంచి చూసేవాడినన్నాడు. తెలుగు హీరోల గురించి ధోనీ ఎక్కడా నేరు ప్రస్తావించకున్నా.. అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు చూస్తారనే ప్రచారం ఉంది.
తన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఎంఎస్ ధోనీ అన్‌టోల్డ్ స్టోరీస్ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరగ్గా.. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళిపై ధోనీ ప్రశంసల జల్లు కురిపించాడు. రాజమౌళి సినిమాలంటే తనకు ఇష్టమని, ఆయనతో కలిసి వేదిక పంచుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.

ధోనీ తన సొంత నిర్మాణ సంస్థ 'ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్' ద్వారా తమిళంలో 'లెట్స్ గెట్ మ్యారీడ్' (LGM) అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా తెలుగులోకి కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ధోనీ సతీమణి సాక్షి సింగ్ పాల్గొని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే తనకు ఇష్టమని తెలిపింది.
'ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లేని రోజుల్లోనే హిందీలోకి డబ్ అయిన అల్లు అర్జున్ సినిమాలను యూట్యూబ్‌లోని గోల్డ్‌మైన్ ప్రొడక్షన్స్ ఛానెల్‌లో చూసేదాన్ని. అల్లు అర్జున్‌కు సంబంధించిన అన్ని సినిమాలను చూశాను. నేను అల్లు అర్జున్‌కు పెద్ద అభిమానిని. ప్రస్తుతానికి ఆయనతో సినిమా తీసేంత బడ్జెట్ మా దగ్గర లేదు. కానీ భవిష్యత్తులో తప్పకుండా ప్రయత్నిస్తాం'అని సాక్షి సింగ్ చెప్పుకొచ్చారు.