
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. 'కెరీర్ అసాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ వెంటనే ఏ మాత్రం ఊహించని విధంగా 'నీ దారిలోనే నడుస్తా' అంటూ సురేశ్ రైనా రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఈ దిగ్గజాల ఆకస్మిక నిర్ణయాలతో యావత్ క్రికెట్ ప్రపంచం కలవరపాటు గురి కాగా.. సహచర ఆటగాళ్లు సైతం షాక్‌కు గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఈ దిగ్గజాలకు ఘన వీడ్కోలు పలికారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రతీ ఆటగాడు ఏదో ఒకరోజు ఆటకు గుడ్‌బై చెప్పాల్సిందేనని, కానీ మనకు బాగా తెలిసిన వ్యక్తుల వీడ్కోలు మాత్రం భావోద్వేగానికి గురిచేస్తుందని ట్వీట్ చేశాడు. ఇక ధోనీ సాధించిన ఘనతలు ఈ ప్రపంచం మొత్తం చూసిందని కొనియాడాడు.
'ప్రతీ క్రికెటర్ ఏదో ఒకరోజు తన జర్నీని ముగించి తీరాల్సిందే. కానీ మన మనసుకు దగ్గరైన వాళ్లు వీడ్కోలు పలికితే ఎక్కువ ఫీలవుతాం. నువ్వు దేశం కోసం చేసింది అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కానీ మనమిద్దరం ఒకరికొకరు ఇచ్చుకున్న గౌరవం, నువ్వు నాపై చూపించిన మమకారం ఎప్పటికీ నాలోనే ఉంటుంది. ప్రపంచం నీ ఘనతలను చూసింది. నేను నీ వ్యక్తిత్వాన్ని చూశాను. అన్నింటికీ థ్యాంక్స్ మై కెప్టెన్.. నా క్యాప్ తీసి నీకు సెల్యూట్ చేస్తున్నా.’అని కోహ్లీ ట్వీట్ చేశాడు.
ఇక రైనాను ఉద్దేశించి.. 'భవేష్ (రైనా) నీ సక్సెస్ ఫుల్ కెరీర్‌కు అభినందనలు.. నీ భవిష్యత్తు ఇంకా బాగుండాలి'అని పేర్కొన్నాడు.
'ఎప్పటికీ ధోనీ ఒక్కడే. నా కెరీర్‌కు స్పూర్తిదాయకంగా నిలిచిన నీకు ధన్యవాదాలు పెద్దన్నా. బ్లూజెర్సీలో నీతో మళ్లీ ఆడే అవకాశం మిస్సయ్యాం. కానీ నువ్వెప్పుడు నా కోసం ఉంటావని, మార్గ నిర్దేశం చేస్తావని అనుకుంటున్నా.'- హార్దిక్ పాండ్యా