టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్పెషల్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. టీమిండియా మెంటార్‌గా కొనసాగాలని ధోనీని బీసీసీఐ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ 2021 సమయంలో ధోనీని బీసీసీఐ తాత్కలిక మెంటార్‌గా నియమించింది. కేవలం ఆ టోర్నీ వరకే సేవలు అందించేలా ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత ధోనీకి ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు. ఈ సారి మాత్రం ఇలా షార్ట్ టర్మ్ కాకుండా.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అతని చురుకైన వ్యూహాలను సుదీర్ఘంగా వాడుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే అతన్ని మరోసారి మెంటార్‌గా నియమించేందుకు సిద్ధమైనట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ ఆఫర్‌ను ధోనీ స్వీకరిస్తాడా? అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న గౌతం గంభీర్ ఇందుకు అంగీకరిస్తాడా? అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మెంటార్ ధోనీ విషయంలో గంభీర్ సానుకూలంగా ఉండకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు ధోనీ అంటేనే గంభీర్‌కు పడదు.

ధోనీ సారథ్యంలో భారత్ గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ 2011 జట్లలో గంభీర్ కూడా సారథిగా ఉన్నాడు. ఈ రెండు టోర్నీల ఫైనల్లో గంభీర్ మెరుగైన ప్రదర్శన చేశాడు. కానీ ఈ గెలుపు క్రెడిట్ మొత్తం ధోనీకే దక్కిందని గంభీర్ అనేక ఇంటర్వ్యూల్లో అసంతృప్తి వ్యక్తం చేశాడు. సమష్టిగా రాణిస్తేనే విజయాలు దక్కుతుందని చెప్పే గంభీర్.. ధోనీని మెంటార్‌గా నియమించేందుకు స్వీకరిస్తాడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇటీవల ఈ ఇద్దరూ కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న వీడియో వైరల్‌గా మారింది.
ఐదేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ప్రస్తుతం 44 ఏళ్లు ఉన్న ధోనీ.. వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడుతాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ధోనీ మాత్రం తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు. సీజన్ ప్రారంభానికి ముందు తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పాడు.