టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డగౌట్ నుంచి సలహాలు తీసుకోని ఏకైక ఐపీఎల్ సారథి ధోనీనే అని తెలిపాడు. ప్రస్తుతం క్రికెట్ కూడా ఫుట్‌బాల్ మాదిరిగా మారిందని, కోచ్‌లు బౌండరీ లైన్ వద్ద నిలబడి ఆటగాళ్లకు నిరంతరం సలహాలు ఇస్తున్నారని పాంటింగ్ పేర్కొన్నాడు.
తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రికీ పాంటింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'క్రికెట్ కూడా ఇప్పుడు ఫుట్‌బాల్ ఆటలా మారింది. కోచ్‌లు బౌండరీ లైన్ వద్ద నిల్చొని ఆటగాళ్లకు నిరంతరం సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఇలా డగౌట్ నుంచి సలహాలు తీసుకోని కెప్టెన్లు చాలా అరుదు. బహుషా.. ఐపీఎల్‌లో ఇలా డగౌట్ నుంచి సలహాలు తీసుకొని ఏకైక కెప్టెన్ ధోనీనే.

ధోనీ తన నిర్ణయాలపై పూర్తి నమ్మకంతో ఉంటాడు. మ్యాచ్ సమయంలో డగౌట్ నుంచి వచ్చే సలహాలపై ఏ మాత్రం ఆధారపడడు. కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ మైదానంలో సారథులకు సలహాలు ఇవ్వడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. కానీ ధోనీ మాత్రం ఎవరీ సలహాలు తీసుకోడు. ఇదే అతన్ని ప్రత్యేకమైన సారథిగా నిలబెట్టింది. ఐపీఎల్‌లో అత్యంత నిలకడగా రాణించే జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ఇందుకు ధోనీ నాయకత్వమే కారణం.'అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్‌లో తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు చాలా సలహాలు ఇచ్చామని కూడా రికీ పాంటింగ్ గుర్తు చేసుకున్నాడు. 'మా తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు చాలా సలహాలు ఇచ్చాం. గేమ్‌లో చేయాల్సిన విషయాలపై అయ్యర్ తరుచూ ప్రశ్నలు అడిగాడు. టైమ్ ఔట్ సమయంలో కెప్టెన్లు, సీనియర్ ఆటగాళ్లతో మాట్లాడేందుకు కోచ్‌లకు అవకాశం ఉంటుంది.'అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ గాయంతో సీజన్ మధ్యలోనే తప్పుకోవడంతో ధోనీనే మళ్లీ జట్టును నడిపించాడు. కానీ సీఎస్‌కే ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. 14 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ధోనీ 13 ఇన్నింగ్స్‌ల్లో 135.17 స్ట్రైక్ రేట్‌తో 196 పరుగులే చేశాడు.