న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మోకాలి సర్జరీ విజయవంతంగా పూర్తయ్యింది. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో గురువారం ఉదయం 8 గంటలకు ఈ ఆపరేషన్ జరిగింది. స్పోర్ట్స్ ఆర్థోపెడిక్స్‌లో నిపుణుడు అయిన దిన్షా పార్దివాలా ఈ శస్త్ర చికిత్స చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన స్పోర్ట్స్ మెడిసిన్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.
ధోనీ శస్త్ర చికిత్స విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్ ధృవీకరించారు. ప్రస్తుతం ధోనీ బాగానే ఉన్నాడని, మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతాడని చెప్పాడు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు సైతం దిన్షా పార్దివాలా చికిత్స అందిస్తున్నారు. అతను త్వరగా కోలుకోవడం చూసిన ధోనీ కూడా ఈ ఆసుపత్రిలోనే చికిత్స చేసుకోవడానికి ఇష్టపడినట్లు అతని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ గెలిచిన 48 గంటల్లోనే ధోనీ ఈ చికిత్స చేసుకోవడం గమనార్హం. ఇటీవల ముగిసిన ఈ టోర్నీలో మహేంద్ర సింగ్ ధోనీ మోకాలి సమస్యతో బాధపడిన విషయం తెలిసిందే.

ప్రతీ మ్యాచ్ అనంతరం మొకాలి క్యాప్ పెట్టుకొని కనిపించాడు. ఈ గాయం కారణంగానే అతను ఎక్కువగా బ్యాటింగ్ చేయలేదు. బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినా ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. తమ ఆటగాళ్లకు తనను ఎక్కువగా పరుగెత్తించవద్దని చెప్పానని కూడా ధోనీ వెల్లడించాడు. సర్జరీకి ముందు ధోనీ భగవద్గీత చదువుతూ కనిపించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ గాయం నుంచి కోలుకునేదాన్ని బట్టి ధోనీ ఐపీఎల్ కెరీర్ ఆధారపడనుంది. వచ్చే సీజన్ కూడా ఆడుతానని ప్రకటించిన ధోనీ.. అందుకోసమే శస్త్ర చికిత్స తీసుకొని ఫిట్‌నెస్ సాధించడంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. ఐపీఎల్ 2022 మినీ వేలానికి ఇంకా 6 నెలల సమయం ఉన్న నేపథ్యంలో.. అప్పటి వరకు ఫిట్‌గా మారితే ధోనీ బరిలోకి దిగుతాడు. లేదంటే ఐపీఎల్ నుంచి తప్పుకుంటాడు. అభిమానుల కోసమే వచ్చే సీజన్ ఆడాలనుకుంటున్నట్లు ఇప్పటికే ధోనీ వెల్లడించిన విషయం తెలిసిందే.