
మీ స్టైల్లోనే వీడ్కోలు పలికారు:
ప్రధాని నరేంద్ర మోదీ రెండు పేజీల లేఖలో ఇలా రాసుకొచ్చారు. 'ఆగస్టు 15న మీ శైలిలో రిటైర్మెంట్ ప్రకటించారు. మీ ట్రేడ్‌మార్క్, నిస్సంకోచమైన శైలితో.. మీరు మొత్తం దేశానికి ఉద్వేగభరితమైన చర్చా కేంద్రంగా మారడానికి సరిపోయే చిన్న వీడియోను పంచుకున్నారు. ఆ వీడియో దేశమంతా మీ గురించి మాట్లాడుకునేలా చేసింది. 130 కోట్ల మంది భారతీయులు నిరాశ చెందారు కానీ మీరు భారత క్రికెట్ కోసం చేసిన అన్నిటికీ కృతజ్ఞతలు. గత దశాబ్దంన్నర కాలంలో మీరు భారత క్రికెట్‌కు అందించిన ఎనలేని సేవలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి' అని మోదీ పేర్కొన్నారు.

భారత ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు:
'క్రికెట్ కెరీర్ గురించి చర్చించడానికి మీ గణాంకాలు చాలు. మీరు అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు. భారత క్రికెట్‌ను ప్రపంచ స్థాయిలో అగ్రస్థానానికి తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించారు. గొప్ప బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్, కెప్టెన్‌గా మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. కష్ట సమయాల్లో మీరున్నారనే భరోసా, మ్యాచ్‌ను గెలిపిస్తారనే ధీమాను భారత ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ముఖ్యంగా 2011 ప్రపంచకప్ సాధించిన ఘనత తరాల పాటు ప్రజల మదిలో నిలిచిపోతుంది. ఎంఎస్ ధోనీ అనే పేరు కేవలం గణంకాలకో లేక కొన్ని మ్యాచ్‌ల విజయాల వరకే పరిమితం కాదు. అదెప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది' అని మోదీ అన్నారు.

దేశాన్ని గర్వపడేలా చేశారు:
'ధోనీ.. మిమల్ని ఒక క్రీడాకారుడిగా చూడటం కూడా సరైంది కాదు. మిమ్మల్ని అంచనా వేయాలంటే.. మాటలు సరిపోవు. రాంచీలోని చిన్న పట్టణం నుంచి వచ్చి దేశం గర్వించే స్థాయికి ఎదిగారు. మీకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించారు. అంతేకాదు దేశాన్ని గర్వపడేలా చేశారు. మీరు కోట్లాది మంది యువతరానికి స్ఫూర్తిగా నిలిచారు. మన ప్రయాణం ఎటువైపు వెళ్తుందనే విషయం తెలిస్తే.. మనం ఎక్కడి నుంచి వచ్చామనేది అవసరం లేదు. ఇదే స్ఫూర్తి మీరు ఎంతో మంది యువతలో రగిలించారు. నేటి యువతరం కష్టాలను చూసి జడిసిపోదు. తోటివారిని ప్రోత్సహిస్తూ ధైర్యంగా ముందడుగు వేస్తుంది. అందుకు మీరు సాధించిన 2007 టీ20 ప్రపంచకప్ మంచి ఉదాహరణ. కష్ట సమయాల్లో మీరు జట్టు నడిపించిన తీరే వారికి ప్రేరణ' అని భారత ప్రధాని ప్రశంసించారు.

వాళ్ల త్యాగాలు, మద్దతు లేకపోతే:
'మీ కేశాలంకరణతో ఎలా కనిపించినా.. గెలుపోటములను సమానంగా స్వీకరించే లక్షణం ఎంతో మందికి ఒక పాఠంలా నిలుస్తుంది. మీరు భద్రతా దళాల్లో చేసిన సేవలు అద్భుతం. మన సైనికులతో కలిసి పనిచేయడానికి ఎంతో సంతోషంగా ముందుకొచ్చారు. వాళ్ల మంచి కోసం మీరు పడే తపన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక సాక్షి, జీవాతో ఇప్పుడు ధోనీ అధిక సమయం గడుపుతారు. వాళ్ల త్యాగాలు, మద్దతు లేకపోతే ఏదీ సాధ్యమయ్యేది కాదు. ఒక మ్యాచ్‌లో విజయం సాధించాక జీవాతో ధోనీ ఆడుకోవడం చూశా. అది ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది. అటు ప్రొఫెషనల్, ఇటు వ్యక్తిగత జీవితం రెండింటినీ ఎలా సమన్వయం చేసుకోవాలనే విషయంలోనూ యువత ధోనీని చూసి నేర్చుకోవచ్చు' అని యువతరానికి ప్రధాని సూచించారు. చివరగా మహీ భవిష్యత్తు బాగుండాలని మోదీ ఆశించారు.

రిప్లై ఇచ్చిన మహీ:
ప్రధాని నరేంద్ర మోదీ రాసిన లెటర్‌ను ఎంఎస్ ధోనీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. 'ఒక కళాకారుడు, సైనికుడు, క్రీడాకారుడు ప్రశంసలను కోరుకుంటాడు. వారి కృషి, త్యాగం అందరిచేత గుర్తించబడి, ప్రశంసించబడుతోంది. పీఎం నరేంద్ర మోదీ.. మీ ప్రశంసలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు' అని మహీ ట్వీట్ చేశారు. అంతర్జాతీయ కెరీర్‌లో ధోనీ 90 టెస్ట్ మ్యాచ్‌ల్లో 4,876 పరుగులు సాధించారు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ శతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10,773 రన్స్ చేశారు. వీటిల్లో 10 శతకాలలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183. ఇక 98 టీ20 మ్యాచ్‌లలో 1,600 పరుగుల బాదారు.


Click it and Unblock the Notifications

ఇద్దరు దక్షిణాఫ్రికా క్రికెటర్లకు కరోనా!!










