
జొహాన్నెస్‌బర్గ్: ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ అన్ని రంగాలను ప్రభావితం చేసినట్లుగానే క్రీడా రంగంపైనా ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే పలువురు క్రికెటర్లకు కరోనా వైరస్ సోకింది. తాజాగా దక్షిణాఫ్రికా జట్టులోని ఇద్దరు క్రికెటర్లు వైరస్ బారినపడ్డారు. ఆటగాళ్లు, సిబ్బందికి కలిపి 50 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. అయితే ఆ ఇద్దరి పేర్లను మాత్రం క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) వెల్లడించలేదు. వైరస్ పరీక్షలు చేయించుకున్న వారిలో కెప్టెన్ క్వింటన్ డికాక్, ఎయిడెడ్ మార్క్రమ్, డీన్ ఎల్గర్, డేవిడ్ మిల్లర్, కాగిసో రబాడ, కేశవ్ మహరాజ్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నట్లు ఇఎస్‌పీఎన్ క్రిన్ఇన్ఫో ఓ నివేదిక ప్రాచురించింది.
ఆగస్టు 18 నుంచి 22 వరకు కుకుజాలో పురుషుల క్రికెట్ జట్టుకు క్రికెట్ దక్షిణాఫ్రికా కల్చర్ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. ఈ శిబిరంలో 32 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఆటగాళ్లందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఇద్దరికి కరోనా ఉన్నట్టు తేలింది. 'దక్షిణాఫ్రికా జట్టుకు కల్చర్ క్యాంప్‌ను ఏర్పాటుచేశాం. నిబంధనల ప్రకారం అందరికీ వైరస్ పరీక్షలు చేశాం. ఇద్దరికి పాజిటివ్ రావడంతో.. వెంటనే వారిని ఐసోలేషన్‌కు పంపించాం. వారికి ప్రత్యామ్నాయంగా ఎవరినీ ఎంపిక చేయలేదు. అనుకోని కారణాలతో శిబిరానికి రాలేని వారిని వర్చువల్‌గా హాజరవ్వాలని సూచించాం' అని సీఎస్‌ఏ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫా డుప్లెసిస్ సాంస్కృతిక శిబిరానికి హాజరుకాలేదు. అతడు రెండోసారి తండ్రి కావడంతో ఈ క్యాంప్‌కు దూరంగా ఉన్నాడు. దియూనిస్ డీబ్రూన్ కుటుంబ కారణాలతో మొదట మిస్సైనప్పటికీ.. ఇప్పుడు కుకుజాలో జట్టుతో కలిశాడు. దక్షిణాఫ్రికా క్రికెట్లో జాతివివక్ష పెరగకుండా అడ్డుకొనేందుకు సాంస్కృతిక శిబిరాలను ఏర్పాటు చేస్తారు. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం నేపథ్యంలో ఈసారి శిబిరం వాడివేడిగా జరగనుంది.
జులైలో మహిళల జట్టుకు కూడా సాంస్కృతిక శిబిరాలు ఏర్పాటు చేసింది. అప్పుడు 34 పరీక్షలు చేయగా ముగ్గురికి కొవిడ్-19 సోకినట్టు తెలిసింది. పాజిటివ్ వచ్చిన ముగ్గురు మహిళా క్రికెటర్లు 10 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉంచారు. ఆ తర్వాత వారు కోరుకున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా మహిళల జట్టు కొద్దిరోజుల క్రితమే ప్రాక్టీస్ మొదలుపెట్టిన సంగతి విదితమే.