టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అయోధ్య రాముని ఆహ్వానం అందింది. ఈ నెల 22న జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ట్రస్టు సభ్యులు మహేంద్ర సింగ్ ధోనీకి సోమవారం ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆర్‌ఎస్‌ఎస్ కో ప్రోవిన్స్ సెక్రటరీ ధనంజయ్ సింగ్.. ధోనీని ఆయన నివాసంలో కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
ఈ నెల 22న మధ్యాహ్నం 12.20 గంటలకు కొత్తగా నిర్మించిన అయోధ్య రామయ్య ఆలయంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం యావత్ భారత్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో సహా దేశ విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.

దేశవ్యాప్తంగా వివిధరంగాలకు చెందిన సుమారు 10 వేల మందికి పైగా ప్రముఖులకు రామ జన్మ భూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు పంపింది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌తో పాటు విరాట్ కోహ్లీ, హర్భజన్ సింగ్‌లకు కూడా అయోధ్య రాముని ఆహ్వానం అందింది.
ఇక తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు అగ్ర హీరోలకు కూడా ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. మెగా స్టార్ చిరంజీవితో పాటు అతని తనయుడు రామ్ చరణ్, ప్రభాస్, మోహన్ బాబు, అక్కినేని నాగర్జున వంటి పలువురు హీరోలకు అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందాయి. ఈ వేడుకకు సుమారు లక్ష మందికి పైగా భక్తులు తరలిరావొచ్చని రామ జన్మభూమి ట్రస్ట్ అంచనా వేస్తోంది.
ఐపీఎల్ 2024 సీజన్ కోసం మహేంద్ర సింగ్ ధోనీ సిద్దమవుతున్నాడు. ఇప్పటికే ప్రిపరేషన్ ప్రారంభించిన ధోనీ ఫిట్‌నెస్‌పై కూడా ఫోకస్ పెట్టాడు. ఇటీవలే కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లొచ్చిన ధోనీ.. రిషభ్ పంత్ సొదరి ఎంగేజ్‌మెంట్‌లోనూ సందడి చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్‌తో ధోనీ ఆటకు పూర్తిగా వీడ్కోలు పలికే అవకాశం ఉంది.