టీమిండియా దిగ్గజ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ డైహార్డ్ అభిమానిగా గుర్తింపు పొందిన గోపి కృష్ణన్(34) ఆత్మహత్య చేసుకున్నారు. తమిళనాడులోని కడలూరు జిల్లా ఆరంగూర్‌కు చెందిన గోపీ కృష్ణన్ తన ఇంటిని చెన్నై సూపర్ కింగ్స్ జట్టును తలపించేలా పెయింట్ వేసి వార్తల్లో నిలిచాడు.
చెన్నై ఫ్రాంచైజీ కలర్ ఎల్లోతో పాటు లోగోలు, ధోనీ చిత్రాలను తన ఇంటి గోలపై వేయించాడు. అప్పట్లో అతని ఇంటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దాంతో గోపి కృష్ణన్ ధోనీ డైహార్డ్ ఫ్యాన్‌గా అందరి గుర్తింపు పొందాడు. అయితే ఆర్థిక సమస్యలతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

శుక్రవారం తెల్లవారు జామున తన ఇంటిలోనే గోపి కృష్ణన్ ఆత్మహత్య చేసుకున్నాడని అక్కడి పోలీసులు తెలిపారు. గోపి కృష్ణన్ అకాల మరణం అతని కుటుంబంతోపాటు, ధోని అభిమానులను విషాదంలో పడేసింది. ధోనీకి వీరాభిమాని అయిన గోపీ కృష్ణన్.. దుబాయ్‌లో పనిచేసేవాడు. 2020లో తన స్వగ్రామానికి తిరిగి వచ్చిన అతను.. ధోనిపై ఉన్న అభిమానంతో తన ఇంటికి పసుపు రంగు వేసి ప్రత్యేకమైన అభిమానం చాటుకున్నాడు.
గోపి కృష్ణన్ ఇంటికి సంబంధించిన ఫొటోలు ధోనీ వరకు చేరాయి. ఈ ఇంటిపై స్పందించిన ధోనీ అతన్ని ప్రత్యేకంగా అభినందించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌ను తలపించే ఆ ఇంటి రూపాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూశానని చెప్పిన ధోనీ...తన కోసమే కాకుండా చెన్నై జట్టుపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచే చర్య అని తెలిపాడు.

తమిళనాడు క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సైతం గోపికృష్ణ ఇంటికి వెళ్లి అప్పట్లో అభినందించారు. గోపికృష్ణ ఇంటికి పలువురు సినీ ప్రముఖులతో పాటు ధోనీ అభిమానులు సందర్శించేవారు. గోపి కృష్ణ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నప్పటికీ వన్డే ప్రపంచకప్ సమయంలో భారత్‌కు వచ్చాడు. తన ఊరిలో కొంతమందితో గోపి కృష్ణకు ఆర్థిక వివాదాల నేపథ్యంలో గొడవ జరగ్గా.. మనస్థాపానికి గురైన అతను ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
'గోపికృష్ణకు మా గ్రామంలోని కొంతమందితో ఆర్థిక వివాదాలు ఉన్నాయి. పొంగల్‌కు ముందు జరిగిన క్రీడా పోటీల సందర్భంగా ఇదే విషయంపై గొడవ జరిగింది. కొందరు గోపి కృష్ణపై దాడి చేశారు. మనస్థాపానికి గురైన గోపి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారిపై చర్యలు తీసుకోవాలి.'అని కుటుంబ సభ్యులు ఒకరు మీడియాతో అన్నారు. మృతుడు గోపికృష్ణకు భార్య అన్బరసి, 10, 8 ఏళ్ల కుమారులు ఉన్నారు. 10 రోజుల క్రితమే అతనికి ఆడపిల్ల పుట్టింది.