ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) రోర్ 2026 పేరిట ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఫ్రాంచైజీ ప్రస్తుత, మాజీ క్రికెటర్లు వేర్వేరు జట్లుగా ఏర్పడి సరదాగా ఓ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్‌కు అభిమానులను అనుమతించడంతో చెపాక్ స్టేడియం పసుపుమయమైంది. అభిమానులతో కిక్కిరిసిపోయింది.
ఈ మ్యాచ్ కోసం ధోనీ మైదానంలోకి అడుగుపెట్టగా.. తలా నామస్మరణంతో స్టేడియం దద్దరిల్లిపోయింది. పెవిలియన్ ఎండ్ నుంచి చిన్నగా నడుచుకుంటూ ధోనీ గ్రౌండ్ మధ్యలోకి రాగా.. అభిమానులు తట్టుకోలేకపోయారు. తమ అభిమాన ఆటగాడిని చూసి కొందరు ఫ్యాన్స్ ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. ఓ యువతి అయితే ధోనీ అని గట్టిగా అరుస్తూ కన్నీటి పర్యంతమైంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి 6 ఏళ్లు అవుతున్నా ధోనీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. భారత్‌కు రెండు ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లు అందించిన ధోనీకి అభిమానగణం రెట్టింపు అవుతుందే తప్పా తగ్గడం లేదు. ఈ సీజన్ ధోనీకి చివరిదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ధోనీని చూసిన అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రోర్ 2026 కార్యక్రమానికి సీఎస్‌కే మాజీ ఆటగాళ్లు మాథ్యూ హెడెన్, అంబటి రాయుడు, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, బ్రావోలు హాజరయ్యారు.
ఐపీఎల్ 2026 సీజన్ టైటిల్ గెలిచి ధోనీకి ఘనంగా వీడ్కోలు పలకాలని సీఎస్‌కే భావిస్తోంది. అందుకుతగ్గట్లుగానే నెట్స్‌లో శ్రమిస్తోంది. వేలానికి ముందే రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శాంసన్‌ను ట్రేడ్ చేసుకుంది. గత సీజన్ బలహీనతలను అధిగమించింది. సంజూ రాకతో ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.