మరో జట్టు టైటిల్ గెలవాలని నేను కోరుకోను.. కానీ ఆర్‌సీబీ బాగా ఆడింది: ధోనీ
ఐపీఎల్ 2025 సీజన్‌లో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ అభినందనలు తెలిపాడు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీని.. ఓ అభిమాని ఆర్‌సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవడంపై మీ రియాక్షన్ ఏంటని ప్రశ్నించాడు. దీనికి ధోనీ స్పందిస్తూ.. చెన్నై ఆటగాడిగా ఉంటూ మరో జట్టు టైటిల్ గెలవాలని తాను కోరుకోనని బదులిచ్చాడు. ఆర్‌సీబీ బాగా ఆడిందని, ఆ జట్టుకు తన శుభాకాంక్షలని తెలియజేశాడు.
'నేను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడిగా ఉంటూ.. మరో జట్టు ఐపీఎల్ టైటిల్ గెలవడాన్ని అసలు ఏ మాత్రం ఊహించుకోలేను. కానీ ఆర్‌సీబీ టైటిల్ కోసం చాలా ఏళ్లు నిరీక్షించింది. వారు బాగా ఆడి తమ కలను నెరవేర్చుకున్నారు.వారికి నా శుభాకాంక్షలు. ఈ విషయాన్ని నేను అప్పుడు కూడా చెప్పాను.

కీలకమైన విషయం ఏంటంటే.. మనం ఓ టోర్నీ ఆడుతున్నప్పుడు అందులో మన జట్టే గెలవాలని కోరుకుంటాం. కానీ ప్రతీసారి మనకు అనుకూలంగానే ఫలితాలు రావు. మనం ఊహించనది ఏదైనా జరిగితే.. ప్రత్యర్థి జట్ల నుంచి మనం ఎంతో కొంత నేర్చుకోవచ్చు. ఈ టోర్నీలో ఇది కూడా ఓ కీలకమైన అంశం.'అని ధోనీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించిన ఆర్‌సీబీ తమ 18 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేదు. ఆర్‌సీబీ తరఫున కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలవగా.. హజెల్ వుడ్ అత్యధిక వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఆర్‌సీబీ తమ జట్టును మరింత పటిష్టం చేసుకుంది. ఐపీఎల్ 2026 వేలానికి ముందు అవసరం లేని ఆటగాళ్లను వదిలేసిన ఆర్‌సీబీ.. వెంకటేశ్ అయ్యర్‌ను రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది. న్యూజిలాండ్ పేసర్ జాకబ్ డఫీని కూడా కొనుగోలు చేసి బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications