చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) అభిమానులకు ఆ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గుడ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్ 2025 సీజన్ ఆడుతానని స్పష్టం చేశాడు. అంతేకాకుండా వచ్చే మూడేళ్లు ఆడుతానని, ఆటను ఆస్వాదిస్తానని ట్రిపుల్ ధమాకా అందించాడు. ఐపీఎల్ కోసం ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు కూడా తెలిపాడు.
ఇక ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలం నేపథ్యంలో ధోనీ ఆడటంపై అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ధోనీ ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడని, వికెట్ కీపింగ్ చేయడంలో ఇబ్బంది పడుతున్నాడనే కథనాలు వచ్చాయి. మరోవైపు సీఎస్‌కే మేనేజ్‌మెంట్ కూడా ధోనీ నుంచి స్పష్టమైన సమాచారం రాలేదని చెప్పడంతో అతను ఐపీఎల్‌కు దూరమవుతాడని అంతా అనుకున్నారు. కానీ తాజాగా ధోనీ ఓ కార్యక్రమంలో ఈ వార్తలకు చెక్ పెట్టాడు.

'ఆటను ఆస్వాదిస్తూ ఆడితే జట్టుకు, వ్యక్తిగతంగాను ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఇకపై నేను క్రికెట్‌ను మరింత ఆస్వాదించాలని అనుకుంటున్నాను. ప్రొఫెషనల్ క్రికెట్ ఆడేవారు ఎల్లవేళలా ఆటను ఆస్వాదించడం చాలా కష్టం. కానీ, నేను మాత్రం అలా ఉండకుండా ఆటను ఆస్వాదించాలని నిర్ణయించుకున్నా. అయితే ఇది చాలా కష్టమైన పనే. కమిట్‌మెంట్స్, భావోద్వేగాలు మిళితమై ఉంటాయి.
వీటన్నింటినీ పక్కనపెట్టేసి రాబోయే కొన్నేళ్లు ఆటను ఆస్వాదిస్తా. అందుకోసం గత తొమ్మిది నెలలుగా ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాను. ఐపీఎల్‌లో కేవలం రెండున్నర నెలలు మాత్రమే ఆడుతా. అందుకోసం పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. అదే సమయంలో వ్యక్తిగతంగానూ జీవితాన్ని గడపాలి.'అని ధోనీ వెల్లడించాడు.
మహేంద్ర సింగ్ ధోనీ కోసమే చెన్నై సూపర్ కింగ్స్ ఓ పాత రూల్‌ను మళ్లీ ప్రవేశ పెట్టేలా బీసీసీఐపై ఒత్తిడి తీసుకొచ్చింది. బీసీసీఐ కూడా ధోనీకి ఉన్నక్రేజ్ నేపథ్యంలో వారి డిమాండ్‌కు అంగీకరించింది. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఐదేళ్లు పూర్తి చేసుకున్న భారత ఆటగాళ్లను అనామక ప్లేయర్లుగా పరిగణించి రిటైన్ చేసుకునే రూల్‌ను బీసీసీఐ మళ్లీ ప్రవేశపెట్టింది. 2018 ఐపీఎల్ మెగా వేలం వరకు ఈ రూల్ అమల్లో ఉండగా.. ఐపీఎల్ 2022 మెగా వేలం సమయంలో తీసేసారు.
2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ అనంతరం ధోనీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని అనామక ప్లేయర్‌గా రూ. 4 కోట్లకే రిటైన్ చేసుకోనుంది. అక్టోబర్ 31లోపు రిటెన్షన్ లిస్ట్‌ను అందజేయాలని ఫ్రాంచైజీలను బీసీసీఐ ఆదేశించింది. నవంబర్ 30న మెగా వేలం నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది.