టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ నేటి(జూలై 7)తో 44వ ఏడాదిలోకి అడుగుపెట్టాడు. దాంతో సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ధోనీకి బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌ను కదిలించినా.. ధోనీ బర్త్‌డే విషెస్‌కు సంబంధించిన పోస్టులే కనిపిస్తున్నాయి. స్టార్ స్పోర్ట్స్ సైతం ధోనీ కోసం ప్రత్యేకంగా ఓ వీడియోను రూపొందించి విషెస్ తెలియజేసింది.
మరోవైపు ధోనీ బర్త్‌డే సెలెబ్రేషన్స్‌ను హంగామాగా ఏం చేసుకోడు. ఈ సారి కూడా తన స్నేహితుల సమక్షంలోనే కేక్ కట్ చేసి బర్త్ సెలెబ్రేషన్స్‌ను ముగించాడు. కనీసం ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా చిన్ననాటి స్నేహితుల మధ్య సింపుల్‌గా బర్త్‌డే వేడుకలు జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో ధోనీ స్లీవ్‌లెస్ బనియన్, షార్ట్స్‌లో ఉన్నాడు. స్నేహితులకు కేక్ తినిపించి వారి శుభాకాంక్షలు అందుకున్నాడు. భారత దిగ్గజ కెప్టెన్‌గా ఎదిగినా.. కోట్ల డబ్బులు ఆర్జించినా ధోనీ తన చిన్ననాటి స్నేహితులను మరిచిపోలేదు. సింపుల్‌గా జీవించేందుకు ఇష్టపడే ధోనీ.. తన చిన్ననాటి స్నేహితులతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నాడు. ఇందులో కొందర్ని తన వ్యాపార భాగస్వాములుగా మార్చుకున్నాడు.

టీమిండియా కెప్టెన్‌గా ధోనీ ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించాడు. 2007 టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ 2011, ఛాంపియన్స్ ట్రోఫీ 2013లు గెలిచి మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచి ఏకైక కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు. ఐదేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో అనామక ఆటగాడిగా బరిలోకి దిగిన ధోనీ.. రుతురాజ్ గైక్వాడ్ గాయంతో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా విఫలమై లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. 44 ఏళ్ల వయసున్న ధోనీ.. వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. అప్పటి కండిషన్స్ బట్టి ఐపీఎల్ ఆడే విషయంపై తుద నిర్ణయం తీసుకుంటానని ధోనీ తెలిపాడు.