
భోపాల్: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత మహిళల హాకీ టీమ్‌పై మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసల జల్లు కురిపించారు. మెడల్ తేకపోయినా అత్యుత్తమ ప్రదర్శన చేసిన అందరి మనసులు గెలుచుకున్నందుకు క్యాష్ రివార్డ్స్ ప్రకటించారు. జట్టులోని ఒక్కొక్కరికి రూ. 31 లక్షల చొప్పున నగదును బహుమతిగా అందజేస్తామన్నారు. అలాగే స్వర్ణంతో చరిత్ర సృష్టించిన భారత బళ్లెం వీరుడు నీరజ్ చోప్రాను ప్రత్యేకంగా అభినందించాడు.
'నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అతని నిరంతర కృషి, పట్టుదల అభినందనీయం. దేశం అతన్ని చూసి గర్విస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లో మన హాకీ మహిళా జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేసింది. తృటిలో పతకం చేజార్చుకున్నప్పటికీ.. వారు ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారు. భవిష్యత్తులో వారు తప్పక విజయం సాధిస్తారు. జట్టు సభ్యులకు ఒక్కొక్కరికీ రూ.31 లక్షల చొప్పున నగదు బహుమతిని అందజేస్తాం. 'అని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా పసిడి పతకం సాధించిన విషయం తెలిసిందే. వ్యక్తిగత విభాగాల్లో అభినవ్ బింద్రా తర్వాత స్వర్ణం సాధించిన క్రీడాకారుడిగా నీరజ్‌గుర్తింపు పొందాడు. అంతేకాకుండా 100 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అథ్లెటిక్స్‌లో మెడల్ అందించాడు. మరోవైపు కాంస్య పతక పోరులో బ్రిటన్ చేతిలో భారత హాకీ మహిళా జట్టు 3-4 గోల్స్ తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో భారత్ నాలుగో స్థానానికి పరిమితమైంది. ఈ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో 7 పతకాలు నమోదయ్యాయి. మీరాబాయి చాను, రవికుమార్ దహియా రజతం గెలవగా.. పీవీ సింధు, బజరంగ్ పునియా, లవ్లీనా, భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాలను సొంతం చేసుకున్నాయి.
ఆదివారం విశ్వక్రీడలు ముగిసాయి. జపాన్ నేషనల్ స్టేడియంలో జపాన్ సంస్కృతి ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు. ఒలింపిక్స్ టార్చ్‌ను, జెండాను పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులకు అందించి టోక్యో ఒలింపిక్స్ ముగిసాయని అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ ఒలింపిక్స్‌లో మొత్తం 85 దేశాలు మెడల్స్ ఖాతా తెరవగా.. భారత్ ఏడు పతకాలతో మెడల్స్ టేబుల్‌లో 47వ స్థానంలో నిలిచింది. ఈ సారి కూడా పతకాల వేటలో అమెరికా, చైనా, జపాన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
39 స్వర్ణాలతో అమెరికా అగ్రస్థానంలో నిలవగా.. 38 స్వర్ణాలతో చైనా రెండో స్థానంలో, 27 స్వర్ణాలతో ఆతిథ్య జపాన్ మూడో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా పతకాల వారిగా చూసుకుంటే అమెరికా 113 పతకాలు(39 స్వర్ణం, 41 రజతం, 33 కాంస్యం), చైనా 88 పతకాలు( 38 స్వర్ణం, 32 రజతం, 18 కాంస్యం), జపాన్ 58 పతకాలు (27 స్వర్ణం, 14 రజతం, 17 కాంస్యం) సాధించాయి.