
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సెకండాఫ్ మ్యాచ్‌లకు ఎదురవుతున్న ఆటంకాలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి. ప్రపంచ క్రికెట్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆధిపత్యం, వ్యూహాత్మక అడుగులతో మెగా లీగ్‌కు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే వేదికలు, తేదీలపై స్పష్టత వచ్చేసింది. టీ20 ప్రపంచకప్‌ను యూఏఈలో నిర్వహిస్తామని బీసీసీఐ, ఐసీసీ రెండురోజుల క్రితమే స్పష్టం చేశాయి. దాంతో విదేశీ ఆటగాళ్లు రెండో దశ ఐపీఎల్ ఆడేందుకు మొగ్గు చూపుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్లు దుబాయ్ వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం.
ఐపీఎల్ సెకండాఫ్ సమయంలో ద్వైపాక్షిక సిరీస్‌ల పేరిట క్యాష్ రిచ్ లీగ్‌కు దూరంగా ఉండాలని భావించిన ఆయా దేశాలు.. యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్ నిర్వహిస్తామని బీసీసీఐ చెప్పడంతో పునరాలోచనలో పడ్డాయి. మెగా టోర్నీకి ముందు జరుగుతున్న ఐపీఎల్ ఆడితే ఆటగాళ్లకు అక్కడి పరిస్థితులపై పట్టు లభిస్తోందని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ఆటగాళ్లు దుబాయ్‌కు వచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
వాస్తవానికి ఐపీఎల్ సెకండాఫ్ మ్యాచ్‌లు జరగనున్న సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాకు ద్వైపాక్షిక సిరీసులు ఉన్నాయి. వ్యక్తిగత, ఇతర కారణాలతో వాటికి అందుబాటులో ఉండలేమని కొందరు ఆటగాళ్లు చెప్పేశారు. దాదాపు 20 మంది ఐపీఎల్ ఆటగాళ్లలో తొమ్మిది మంది మాత్రమే బంగ్లా, వెస్టిండీస్ పర్యటనకు వస్తామని చెప్పారట. దాంతో గ్లెన్ మాక్స్‌వెల్, జే రిచర్డ్‌సన్, కేన్ రిచర్డ్‌సన్, మార్కస్ స్టొయినిస్, డేనియెల్ సామ్స్ తదితరులు ఐపీఎల్‌కు వస్తారని తెలిసింది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ యూఏఈలో జరుగుతుండటంతో ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ సైతం ఆలోచనలో పడిందని సమాచారం. వారిని అడ్డుకోకుండా ఉండటమే మంచిదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడేందుకు వస్తామని గతంలోనే చెప్పారు. ఇందుకోసమే కరీబియన్ లీగ్‌ను సైతం ముందుకు జరిపారు. ఇప్పుడు ఆసీస్ క్రికెటర్లలో చాలామంది వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డును కూడా బీసీసీఐ ఒప్పించే పనిలో పడిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అన్నీ ,కుదిరితే ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఆటగాళ్లు కూడా వచ్చే అవకాశం ఉంది.