టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. నిబంధనలకు విరుద్దంగా హర్షిత్ రాణాను ఆడించారని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌తో సహా మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా పుణె వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 15 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో 3-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.
అయితే ఈ మ్యాచ్‌లో హర్షిత్ రాణా కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా టీ20ల్లోకి అరంగేట్రం చేసి మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ కనబర్చాడు. మూడు కీలక వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. శివమ్ దూబే కంకషన్ గాయానికి గురవ్వడంతో అతని స్థానంలో బరిలోకి దిగాడు. చివరి వరకూ బ్యాటింగ్ చేసిన శివమ్ దూబేకు సడెన్‌గా ఎందుకు కంకషన్ అవసరమయ్యాడు? హర్షిత్ రాణాను ఎలా ఎంపిక చేశారనే ప్రశ్నలు వచ్చాయి. వీటికి టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ సమాధానం ఇచ్చాడు.

శివమ్ దూబేకు తలనొప్పి లక్షణాలు మొదలైనట్లు చెప్పడంతోనే కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను వాడుకున్నామని తెలిపాడు. మ్యాచ్ రిఫరీ అనుమతితోనే హర్షిత్ రాణాను బరిలోకి దించామని స్పష్టం చేశాడు. 'బ్యాటింగ్ సమయంలో శివమ్ దూబే హెల్మెట్‌కు బంతి బలంగా తాకింది. ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో తలనొప్పిగా ఉందని దూబే సమాచారమిచ్చాడు. దాంతో అతనికి బదులుగా మరొకరిని మ్యాచ్ రిఫరీకి తెలియజేశాం. సరైన సబ్‌స్టిట్యూట్ పేరునే ఇచ్చాం.
ఆ తర్వాతే రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో హర్షిత్ రాణా డిన్నర్ చేస్తున్నాడు. వెంటనే సిద్దమై ఫీల్డింగ్‌కు దిగాడు. అసాధారణ బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎవరినైనా ఆడించే అధికారం ఎవరికి ఉండదు. పేరు ఇవ్వడం వరకే మా పని. మ్యాచ్ రిఫరీ తుది నిర్ణయం తీసుకుంటారు. రిఫరీ నుంచి అనుమతి రావడంతోనే హర్షిత్ రాణాను బరిలోకి దించాం.'అని మోర్నీ మోర్కెల్ చెప్పుకొచ్చాడు.
అయితే శివమ్ దూబేకు హర్షిత్ రాణా సరిపోలే ఆటగాడు కాదని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ వాదిస్తున్నాడు. ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీతోనే తేల్చుకుంటానని తెలిపాడు. కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా బరిలోకి దించారని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే రూల్స్ ప్రకారం కంకషన్ సబ్‌స్టిట్యూట్‌పై పూర్తి నిర్ణయం మ్యాచ్ రిఫరీదే. ఈ నిర్ణయాన్ని సవాల్ చేసే అధికారం కూడా ప్రత్యర్థి జట్టుకు లేదు. ఆఖరి టీ20లో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ఆడుతాడని మోర్నీ మోర్కెల్ తెలిపాడు.