ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా దూకుడు కొనసాగుతోంది. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను భారత్ 61 పరుగుల తేడాతో మట్టికరిపించిన సంగతి తెలిసిందే. భారత్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 114 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ గెలుపుతో టీమిండియా సూపర్-8 బెర్త్ దక్కించుకోవడంతో పాటు పాకిస్థాన్‌పై తమ ఆధిపత్యాన్ని 8-1గా మార్చుకుంది.
అయితే ఈ మ్యాచ్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ హోదాలో హాజరైన మోహ్‌సిన్ నఖ్వీ (Mohsin Naqvi) మధ్యలోనే స్టేడియం వీడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బంగ్లాదేశ్‌ను ఉసిగొల్పి ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ నుంచి తప్పుకునేలా చేసిన పీసీబీ.. ఆ జట్టుకు సంఘీభావంగా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామంటూ బెదరింపులకు దిగింది. ఐసీసీ జోక్యంతో తలొగ్గి మ్యాచ్ ఆడింది.

దాంతో ఈ మ్యాచ్‌కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. మిస్టరీ స్పిన్నర్ ఉస్మాత్ తారిక్ విలక్షణమైన యాక్షన్ మ్యాచ్‌పై ఆసక్తిని రెట్టింపు చేసింది. కొలంబోలోని స్పిన్ కండిషన్స్‌కు తగ్గట్లు పాక్ జట్టులో ఆరుగురు స్పిన్నర్లు ఉండటంతో ఉత్కంఠ తప్పదని అంతా భావించారు. కానీ భారత్ ఆధిపత్యం ముందు పాకిస్థాన్ తేలిపోయింది. ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. దాంతో ఆ జట్టు ఘోర పరాజయం చవిచూసింది.
ఓటమి చాలా ముందుగానే ఖరారు కావడంతో మోహ్‌సిన్ నఖ్వీ మ్యాచ్ మధ్యలోనే స్టేడియం నుంచి వెళ్లిపోయాడు. పాక్ బాయ్‌కాట్ డ్రామాకు ప్రధాన సూత్రధారి నఖ్వీనే. తమ జట్టు భారత్‌ను ఓడిస్తే ఓవర్ యాక్షన్ చేద్దామని భావించిన పీసీబీ చీఫ్‌కు టీమిండియా ప్లేయర్లు గట్టి షాకిచ్చారు. దాంతో మోహ్‌సిన్ నఖ్వీపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.
భారత్ దెబ్బకు పీసీబీ చీఫ్ పారిపోయాడని, ఫలితం తేలేలోపే పాకిస్థాన్‌కు చేరుకున్నాడని కామెంట్ చేస్తున్నారు. 'పగోడి ముందు పరువు తీశారు కదరా!'అని మోహ్‌సిన్ నఖ్వీ తల బాదుకుంటున్నట్లు మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. పాకిస్థాన్ అభిమానులు కూడా మ్యాచ్ ముగియకముందే స్టేడియం వీడారు. స్టేడియం బయట మీడియాతో తమ ఆవేదన వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ గట్టి పోటీ ఇస్తుందని భావించామని, కానీ ఇలా ఘోర పరాజయం పాలవుతుందని ఊహించలేదని బాధపడ్డారు. భారత్ చేతిలో ఓడిపోవడం పాక్‌కు అలవాటైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలానే ఆడితే ఎప్పటికీ టీమిండియాను పాకిస్థాన్ ఓడించలేదని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారాయి.