టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ డీఎస్‌పీ మహమ్మద్ సిరాజ్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక సార్లు 4 వికెట్ల ఘనతను అందుకున్న భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతను జస్‌ప్రీత్ బుమ్రా రికార్డ్‌ను అధిగమించాడు. ఇంగ్లండ్‌తో ఓవల్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో నాలుగు వికెట్లు తీయడం ద్వారా సిరాజ్(4/86) ఈ ఫీట్ సాధించాడు. అంతేకాకుండా వకార్ యూనిస్ తర్వాత ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక నాలుగు వికెట్ల ఘనతను అందుకున్న ఆసియా బౌలర్‌గా కూడా నిలిచాడు.
వకార్ యూనిస్ ఇంగ్లండ్ గడ్డపై 6 సార్లు నాలుగు వికెట్ల ఘనతను అందుకున్నాడు. సిరాజ్ ఐదు సార్లు నాలుగు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా నాలుగు సార్లు నాలుగు వికెట్ల ఘనతను సాధించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో 200 వికెట్ల మైలురాయి అందుకున్న సిరాజ్.. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు. టెస్ట్‌ల్లో 118 వికెట్లు తీసిన సిరాజ్.. వన్డేల్లో 71, టీ20ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 203 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ 201 వికెట్ల రికార్డ్‌ను అధిగమించాడు. టెస్ట్‌ల్లో 46 వికెట్లు తీసిన సచిన్.. వన్డేల్లో 154, టీ20ల్లో ఓ వికెట్ పడగొట్టాడు.

ఆఖరి టెస్ట్‌లో సిరాజ్ కీలక వికెట్లు పడగొట్టాడు. ఓలీ పోప్, జోరూట్, హ్యారీ బ్రూక్, జెమీ స్మిత్‌లను పెవిలియన్ చేర్చి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు సిరాజ్ 9 ఇన్నింగ్స్‌ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడిన ఏకైక పేస్ బౌలర్ కూడా సిరాజే. ఇంగ్లండ్ తరఫున క్రిస్ వోక్స్ ఐదు టెస్ట్‌లు ఆడగా.. చివరి మ్యాచ్ మధ్యలోనే గాయంతో దూరమయ్యాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటవ్వగా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులు చేసింది. 27 పరుగుల లోటు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 75/2తో నిలిచింది. క్రీజులో యశస్వి జైస్వాల్(51 బ్యాటింగ్)తో పాటు ఆకాష్ దీప్(4) ఉన్నాడు.