
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ గల్లీ భాయ్ మహమ్మద్ సిరాజ్ తన తండ్రిని తలుచుకోని భావోద్వేగానికి గురయ్యాడు. సోషల్ మీడియా వేదికగా తన తండ్రి ఫొటోను పంచుకున్న మియా భాయ్.. భావోద్వేగపూరితమైన క్యాప్షన్ ఇచ్చాడు. 'అబ్బాయిలు ఎప్పుడూ ఏడ్వకూడదని నాన్న తరుచూ చెప్పేవాడు. నేను కూడా అందరి ముందు ఎప్పుడూ ఏడ్వలేదు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం బాధను ఆపుకోలేకపోయాను.. మిస్ యూ డాడ్'అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో సిరాజ్ ఉండగా అతని తండ్రి మరణించిన విషయం తెలిసిందే. తండ్రి మరణ వార్త తెలిసినా.. బయో బబుల్ నిబంధనలు, తండ్రి కలను నేరవేర్చాలనే సంకల్పంతో సిరాజ్ జట్టుతోనే ఉండిపోయాడు. ఈ పర్యటనలో మెల్‌బోర్న్ టెస్ట్‌తో అంతర్జాతీయ టెస్ట్‌ల్లోకి అరంగేట్రం చేసిన సిరాజ్.. బ్రిస్బెన్ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లో ఐదు వికెట్లు తీసి తన తండ్రికి ఘన నివాళులర్పించాడు. అనంతరం ఇంగ్లండ్ పర్యటనలోనూ దుమ్మురేపాడు. ముఖ్యంగా లార్ట్స్ టెస్ట్ విజయంలో సిరాజ్ పాత్ర మరవలేనిది. ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తరఫున సిరాజ్ దుమ్మురేపాడు. ముఖ్యంగా గత రెండు సీజన్లుగా అతను మరింత మెరుగ్గా రాణిస్తున్నాడు. బ్రిస్బేన్ టెస్ట్ తర్వాత కొత్త సిరాజ్‌ను తలపిస్తున్నాడు.
ఇంగ్లండ్ పర్యటన, ఐపీఎల్ పెర్ఫామెన్స్‌తో సిరాజ్ మళ్లీ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో భారత జట్టకు ఎంపికయ్యాడు. న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై నవంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌కు ఎంపిక చేసిన 16 మంది సభ్యులు గల జట్టులో మియా భాయ్ చోటు దక్కించుకున్నాడు. తీరిక లేని క్రికెట్ ఆడుతున్న స్టార్ పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ విశ్రాంతి ఇవ్వడంతో సిరాజ్‌కు లైన్ క్లియర్ అయింది.
అంతా ఊహించినట్లుగానే రోహిత్ శర్మకు టీ20 సారథ్యబాధ్యతలు అప్పగించిన చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ.. కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానన్న విరాట్ కోహ్లీతో పాటు సీనియర్ బౌలర్లు బుమ్రా, షమీ, జడేజాలకు విశ్రాంతినిచ్చింది. సీనియర్ల గైర్హాజరీలో ముగ్గురు కొత్త ప్లేయర్లను టీమ్‌లో అవకాశం కల్పించింది. ఐపీఎల్‌లో సత్తా చాటిన వెంకటేశ్ అయ్యర్(కేకేఆర్)తో పాటు ఈ ఐపీఎల్ సీజన్‌లో టాప్ వికెట్ టేకర్‌గా నిలచిన హర్షల్ పటేల్(ఆర్‌సీబీ), అవేశ్ ఖాన్(ఢిల్లీ క్యాపిటల్స్)ను ఎంపిక చేసింది. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మళ్లీ జట్టులోకి రాగా.. టీ20 ప్రపంచకప్‌లో విఫలమైన భువనేశ్వర్ కుమార్‌కు మరో అవకాశం ఇచ్చింది. ఇక ఈ సిరీస్ నుంచే రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.