తన బ్యాటింగ్‌తోనే పాకిస్థాన్‌పై విజయం దక్కిందని టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా పాకిస్థాన్‌తో గత ఆదివారం జరిగిన లో స్కోరింగ్ గేమ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో చివరి స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సిరాజ్ ఏడు బంతులు ఆడి ఏడు పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఇందులో రెండు క్విక్ డబుల్స్ ఉన్నాయి. పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ త్రోతో సిరాజ్ ఈ పరుగులు రాబట్టాడు. చివరకు ఈ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో తాను చేసిన పరుగులు జట్టు విజయానికి అసరమయ్యాయని సిరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. చాహల్ టీవీతో మాట్లాడుతూ సిరాజ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

'ఐపీఎల్ సమయంలో నేను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాను. కీలక సమయంలో బ్యాటింగ్‌తో రాణించాల్సి ఉంటుందని నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాను. ఒక్కో టెయిలెండర్ల పాత్ర కీలకం అవుతోంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో నేను చేసిన ఏడు పరుగులు ఎంత విలువైనవో తెలిసొచ్చింది.
జట్టు విజయంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే భారీ అంచనాలు ఉంటాయనే విషయం తెలుసు. ఏ మాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాను.'అని మహమ్మద్ సిరాజ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(31 బంతుల్లో 6 ఫోర్లతో 42), అక్షర్ పటేల్(18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 20) మినహా అంతా విఫలమయ్యారు.
8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా(3/21), హ్యారీస్ రౌఫ్(3/21) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ అమీర్(2/23) రెండు వికెట్లు పడగొట్టాడు. షాహిన్ షా అఫ్రిది(2/29) ఒక వికెట్ తీసాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు చేసి ఓటమిపాలైంది. మహమ్మద్ రిజ్వాన్(44 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 31) మినహా అంతా విఫలమయ్యారు. జస్‌ప్రీత్ బుమ్రా(3/14) మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. హార్దిక్ పాండ్యా(2/24) రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్(1/31), అక్షర్ పటేల్(1/11)తలో వికెట్ తీసారు.