హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ పేసర్, హైదరాబాద్ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ తన టీమ్‌కు పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ కోసం నగరానికి వచ్చిన ఆర్‌సీబీ టీమ్‌ను లోకల్ భాయ్ సిరాజ్ కొత్తగా నిర్మించుకున్న తన ఇంటికి ఆహ్వానించాడు. హైదరాబాద్ స్టైల్ రుచులను అందించాడు.
హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో సిరాజ్ తన డ్రీమ్ హౌస్‌ను నిర్మించుకున్నాడు. అయితే తమ ఆతిథ్యం నచ్చిందో లేదోనని కాస్త కంగారుపడ్డానని తాజాగా సిరాజ్ వెల్లడించాడు. ఫ్రాంచైజీ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ.. పార్టీ విశేషాలతో పాటు ఉప్పల్ గ్రౌండ్‌లో తనకు ఉన్న మధుర క్షణాలను పంచుకున్నాడు.

'నా డ్రీమ్ హౌస్‌ను ఆర్‌సీబీ టీమ్ నగరానికి వచ్చేలోపూ పూర్తి చేయాలని కోరాను. ఆర్‌సీబీ టీమ్ మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. నేను చాలా గర్వంగా ఫీలవుతున్నా. ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్‌తో పాటు మా ఇంటికి వచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. మా ఆతిథ్యం నచ్చుతుందో లేదోనని నేను కాస్త కంగారుపడ్డా. హోస్ట్‌గా కాస్త ఒత్తిడికి గురయ్యా.
ఉప్పల్ మైదానంలో నాకు బెస్ట్ ఐపీఎల్ మెమోరీ ఏంటంటే.. ఆర్‌సీబీ గెలవడం. వర్షం కురిసిన ఆ మ్యాచ్‌లో మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించగా విరాట్ కోహ్లీ భాయ్ ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. ఓ ప్రేక్షకుడిగా నాకున్న మధురానుభూతి అది.
ప్లేయర్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఇదే ఉప్పల్ మైదానంలో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాను. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఫుల్‌ప్యాక్ మైదానం చూసి తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను. తొలి మూడు బంతులు బౌండరీలిచ్చుకున్న నేను.. నాలుగో బంతికి వికెట్ తీయడంతో కాస్త రిలాక్స్ అయ్యాను'అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.

నేడు మరికొద్దిసేపట్లో ఉప్పల్ వేదికగా ఆర్‌సీబీ-సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ మొదలవ్వనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ రేసులో నిలవనుంది. ఓడితే మాత్రం ఇతర మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. దాంతో ఈ మ్యాచ్ ఆ జట్టుకు డూ ఆర్ డైగా మారింది.