
ఒక్క బంతి చాలు..
అయితే ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ బెయిర్‌స్టో చెలరేగినా తాము ఆందోళన చెందలేదని టీమిండియా ఫాస్ట్‌బౌలర్ మహమ్మద్ సిరాజ్ అన్నాడు. నాలుగో రోజు ఆట అనంతరం మాట్లాడిన అతను పరిస్థితులకు సానుకూలంగా లేనప్పుడు బౌలర్లు సహనంగా ఉండడం అవసరమని చెప్పాడు. 'బౌలర్లుగా మేం సహనం వహించాలి. బెయిర్‌స్టో ఫామ్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో సిరీస్ నుంచి నిరంతరాయంగా ఎటాకింగ్ గేమ్ ఆడుతున్నాడు. అతడు చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని మాకు తెలుసు. ప్రాథమికాంశాలకు కట్టుబడి ఉండాలన్నది మా ప్రణాళిక. మా సామర్థ్యాన్ని మేం నమ్మాం. అతడెంత బాగా ఆడినా ఒక్క మంచి బంతితో అతడి ఇన్నింగ్స్ ముగిసిపోతుందని మాకు తెలుసు.'అని సిరాజ్ పేర్కొన్నాడు.

ఆ క్యాచ్ పట్టుంటే..?
ఇక 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సిరాజ్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో ఇచ్చిన సునాయస క్యాచ్‌ను స్లిప్‌లో హనుమ విహారి వదిలేశాడు. అది పట్టి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. ఆ తర్వాత మహమ్మద్ షమీ బౌలింగ్‌లో బెయిర్ స్టో ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను పంత్ అందుకోలేకపోయాడు. ఈ రెండు అవకాశాలతో చెలరేగిన బెయిర్ స్టో భారత ఆటగాళ్లకు చక్కులు చూపించాడు. అతనికి తోడుగా జోరూట్ కూడా చెలరేగడంతో ఇంగ్లండ్ విజయం దిశగా నడుస్తోంది.

పంత్ అర్ధసెంచరీ...
నాలుగో రోజు ఆటను పుజారా (168 బంతుల్లో 66; 8 ఫోర్లు), పంత్ కొన్ని చక్కటి షాట్లతో ఆరంభించడంతో తొలి 7 ఓవర్లలో 27 పరుగులు వచ్చాయి. అయితే స్టువర్ట్ బ్రాడ్ తన తొలి ఓవర్లోనే పుజారాను అవుట్ చేసి 78 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెర దించాడు. భారత్ ఆధిక్యం 300 పరుగులు దాటిన తర్వాత 76 బంతుల్లో పంత్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అనంతరం ఎనిమిది పరుగుల వ్యవధిలో పంత్, శ్రేయస్ అయ్యర్ (19) అవుట్ కావడంతో భారత్ కాస్త నెమ్మదించింది. రవీంద్ర జడేజా (23) కొద్ది సేపు గట్టిగా నిలబడినా, శార్దుల్ ఠాకూర్ (4) విఫలమయ్యాడు. చివరి వరుస వికెట్లను పెద్దగా ఇబ్బంది పడకుండా వెంటవెంటనే పడగొట్టిన ఇంగ్లండ్ బౌలర్లు భారత్ ఇన్నింగ్స్‌ను తొందరగా ముగించారు. సోమవారం 36.5 ఓవర్లు ఆడిన టీమిండియా మిగిలిన 7 వికెట్లతో 120 పరుగులు సాధించింది.

సంక్షిప్త స్కోర్లు..
భారత్ తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్(రిషభ్ పంత్ 146, రవీంద్రజడేజా 104, జేమ్స్ అండర్సన్ 5/60)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్(జానీ బెయిర్ స్టో 106, సామ్ బిల్లింగ్స్ 36, మహమ్మద్ సిరాజ్ 4/66)
భారత్ రెండో ఇన్నింగ్స్ 245 ఆలౌట్( పుజారా 66, రిషభ్ పంత్ 57, బెన్ స్టోక్స్ 4/33)
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ : 57 ఓవర్లలో 259/3 (బెయిర్ స్టో 72 బ్యాటింగ్, జోరూట్ 76 బ్యాటింగ్)


Click it and Unblock the Notifications












