దేవుడి దయ వల్లే ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్ట్‌లో చిరస్మరణీయ విజయాన్నందుకున్నామని టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ అన్నాడు. బ్రూక్ క్యాచ్ వదిలేసిన తర్వాత తాము మ్యాచ్‌లో వెనుకబడిపోయామని, కానీ తాను మాత్రం గెలుపుపై ఆశలు వదులుకోలేదని సిరాజ్ స్పష్టం చేశాడు. నాలుగో టెస్ట్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు క్రికెటర్‌గా ఎదిగేందుకు తాను పడిన కష్టాన్ని గుర్తు చేసుకోవాలని రవీంద్ర జడేజా సూచించాడని, ఆ మాటలు తనను మోటివేట్ చేసాయని తెలిపాడు. ఉత్కంఠకే ఊపిరి అందని రీతిలో సాగిన ఆఖరి టెస్ట్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
339/6 ఓవర్ నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. 367 పరుగులకు ఆలౌటైంది. మహమ్మద్ సిరాజ్(5/104) ఐదు వికెట్లతో భారత్‌కు చిరస్మరణీయ వియాజయాన్నందించాడు. సిరాజ్‌తో పాటు ప్రసిధ్ కృష్ణ(4/126) నాలుగు వికెట్లు తీయగా ఆకాష్ దీప్ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ గెలుపుతో ఐదు టెస్ట్‌ల సిరీస్ 2-2తో సమంగా నిలిచింది. ఆఖరి టెస్ట్‌లో సిరాజ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టాడు. గాయంతో బ్యాటింగ్‌కు దిగిన క్రిస్ వోక్స్(0 నాటౌట్) సాయంతో గస్ అట్కిన్సన్(17) పోరాడినా ఫలితం లేకపోయింది.

ఈ విజయానంతరం అధికారిక బ్రాడ్ కాస్టర్‌తో మాట్లాడిన సిరాజ్.. ఈ మ్యాచ్ గెలుపుపై తాను ఆశలు కోల్పోలేదని చెప్పాడు. 'ఏది ఏమైనా సరైన ప్రదేశంలో బౌలింగ్ చేయాలనే ప్లాన్‌తో బరిలోకి దిగాను. వికెట్లు పడినా.. పరుగులు వచ్చినా నేను పట్టించుకోలేదు. బ్రూక్ క్యాచ్ తీసుకున్నప్పుడు బౌండరీ లైన్‌ను తాకుతానని నేను ఊహించలేదు. అది మ్యాచ్‌ను మలుపు తిప్పే క్షణం. ఆ అవకాశంతో బ్రూక్ టీ20 మూడ్‌లోకి వెళ్లిపోయాడు. దాంతో మేం ఆటలో వెనుకంజలో నిలిచాం. కానీ ఆ దేవుడి దయ వల్ల నేను ఏ పాయింట్‌లోనూ విజయంపై విశ్వాసం కోల్పోలేదు. ఈ ఊదయం కూడా అదే నమ్మకంతో బౌలింగ్ చేశాను.'అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.
అసాధారణ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన మహమ్మద్ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన సిరాజ్.. మాంచెస్టర్ టెస్ట్‌లో తన క్రికెట్ ప్రయాణాన్ని, తన తండ్రిని గుర్తు చేసుకోవాలని జడేజా సూచించాడని తెలిపాడు. బ్రూక్ క్యాచ్ పట్టి ఉంటే నిన్ననే మ్యాచ్ ముగిసేదన్నాడు.
'నిజం చెప్పాలంటే.. ఈ విజయం అద్భుతంగా అనిపిస్తుంది. మేం ఈ మ్యాచ్ తొలి రోజు నుంచే గట్టిగా పోరాడాలనుకున్నాం. ఈ మ్యాచ్‌లో గెలవడం గొప్పగా ఉంది. బంతిని ఒకే ప్రదేశంలో వేయడం మా ప్రణాళిక. ఈ రోజు ఉదయం లేవగానే జట్టును గెలిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. అది చేయగలనని గట్టిగా నమ్మాను. హ్యారీ బ్రూక్ క్యాచ్‌ను సరిగ్గా పట్టుకొని ఉంటే.. మ్యాచ్ నిన్ననే ముగిసేది. కానీ బ్రూక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆ క్యాచ్ వదలడం బాధకరమైన క్షణం. గత మ్యాచ్‌లో జడ్డూ భాయ్‌తో బ్యాటింగ్ చేసినప్పుడు నాతో ఒకటే చెప్పాడు. బంతిని మిడిల్ చేయమని సూచించాడు. మీ తండ్రిని, ఇక్కడికి రావడానికి పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకోమన్నాడు.'అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.