టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్( ఐసీసీ) చర్యలు తీసుకుంది. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో సిరాజ్.. ప్రత్యర్థి ఆటగాడి పట్ల అనుచిత ప్రవర్తంచడాన్ని తప్పుబట్టిన ఐసీసీ.. రూల్స్ ప్రకారం అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించింది.
నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్‌ను ఔట్ చేసిన తర్వాత సిరాజ్ ఆగ్రహంగా సంబరాలు చేసుకున్నాడు. అతనిపైకి దూసుకెళ్లి కమాన్ అంటూ గట్టిగా అరిచాడు. ఈ క్రమంలో ఇద్దరి భుజాలు ఢీకొట్టుకున్నారు. సిరాజ్ చర్యను తప్పుబట్టిన అంపైర్లు.. ఆ సమయంలోనే అతన్ని మందలించారు. నాలుగో రోజు ఆట అనంతరం అంపైర్ల ఫిర్యాదుతో విచారణ జరిపిన మ్యాచ్ రిఫరీ నిబంధనల మేరకు చర్యలు తీసుకున్నాడు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.5 ప్రకారం 'ప్రత్యర్థి ఆటగాడి పట్ల అనుచితంగా ప్రవర్తించడం, అసభ్యకర భాషను ఉపయోగించడం, బ్యాటర్ ఔటై వెళ్తున్నప్పుడు దూకుడుగా వ్యవహరించడం అపరాధం'అని ఐసీసీ పేర్కొంది.

మ్యాచ్ రిఫరీ ముందు సిరాజ్ తన తప్పిదాన్ని అంగీకరంచాడు. గత 24 నెలల్లో సిరాజ్ చేసిన రెండో తప్పిదమిది. ప్రస్తుతం అతను ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్స్ ఉన్నాయి. రెండేళ్ల కాలంలో ఆటగాడి ఖాతాలో 4 డీమెరిట్ పాయింట్స్ ఉంటే మ్యాచ్ నిషేధం ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. సిరాజ్ ఖాతాలో మరో రెండు పాయింట్స్ చేరితే నిషేధం పడుతుంది. టెస్ట్‌ల్లో భారత ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజు కింద బీసీసీఐ రూ. 15 లక్షలు చెల్లిస్తోంది. ఇందులో రూ. 15 శాతం కోత అంటే రూ. 2.25 లక్షలు. అయితే ఇది భారత ఆటగాళ్లకు లెక్కే కాదని నెటిజన్లు, మాజీ క్రికెటర్లు అంటున్నారు.