టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ మరో లగ్జరీ కారు కొన్నాడు. కెరీర్‌లో ప్రస్తుతం మంచి దశలో ఉన్న సిరాజ్.. సంపాదనలోనూ దుమ్మురేపుతున్నాడు. శ్రీలంక పర్యటన అనంతరం స్వస్థలమైన హైదరాబాద్‌కు వచ్చిన సిరాజ్.. తన కుటుంబ సభ్యుల కోసం రూ. 3 కోట్ల విలువ చేసే ల్యాండ్ రోవర్ కారు కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మహమ్మద్ సిరాజ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
ఓ సాధారణ ఆటో డ్రైవర్ కొడుకుగా క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించిన సిరాజ్.. అసాధారణ ప్రదర్శనతో అంచెలంచెలుగా ఎదిగాడు. టీమిండియాలో కీలక పేసర్‌గా మారాడు. టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న మహమ్మద్ సిరాజ్‌కు.. బీసీసీఐ ప్రకటించిన రూ. 125 కోట్ల నజరానా నుంచి రూ. 5 కోట్లు వచ్చాయి. ఈ డబ్బులతోనే సిరాజ్ ల్యాండ్ రోవర్ కారు కొని ఉంటాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఇప్పటికే మహమ్మద్ సిరాజ్ దగ్గర అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. టయోటా కొరోల్లా(రూ. 22 లక్షలు), టయోటా ఫార్చునర్(రూ. 40 లక్షలు), బీఎండబ్ల్యూ 5 సిరీస్-రూ. 75 లక్షలు, మెర్సిడెస్ బెంజ్ క్లాస్-(రూ. 1.86 కోట్లు), రేంజ్ రోవర్ వాగ్యూ-రూ. 2.8తో పాటు మహీంద్ర థార్ కార్లు ఉన్నాయి. తాజాగా అతని గ్యారేజ్‌లోకి మరో కాస్ట్‌లీ కార్ చేరింది.
హైదరాబాద్ బస్తీల్లో పెరిగిన సిరాజ్.. ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో ఖరీదైన ఇంటిని నిర్మించుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ సందర్భంగా తన టీమ్ (ఆర్‌సీబీ) ఆటగాళ్లందరినీ ఇంటికి ఆహ్వానించాడు.
ఐపీఎల్‌లో ఒక్క సీజన్‌కు రూ. 7 కోట్ల వేతనం అందుకుంటున్న సిరాజ్.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ల్లో ఏ గ్రేడ్‌లో ఉన్నాడు. ఏ గ్రేడ్ ఆటగాళ్లకు రూ. 5 కోట్ల వార్షిక వేతనం లభిస్తోంది. మ్యాచ్ ఫీజులు, అలవెన్సులు ప్రత్యేకం. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్‌ల ద్వారా లభించే నగదు బహుమతులు కూడా అదనమే. వాణిజ్య ప్రకటనల ఒప్పందాల ద్వారా కూడా డబ్బులు ఆర్జిస్తున్నాడు. బిజినెస్ వెబ్‌సైట్స్ అంచనాల ప్రకారం మహమ్మద్ సిరాజ్ నెట్‌వర్త్ దాదాపు రూ. 74 కోట్లు.
వచ్చే ఏడాదికి అతని నెట్ వర్త్ రూ. 100 కోట్లు ధాటే అవకాశం ఉంది. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న సిరాజ్.. ఏడాదికి రూ. 20 కోట్లకు పైనే సంపాదిస్తున్నాడు. తన అన్నయ్య సాయంతో పలు వ్యాపారాల్లో కూడా భాగస్వామిగా ఉన్నాడు. సిరాజ్ ప్రతిభకు గుర్తింపుగా.. గ్రూప్-1 ఉద్యోగంతో పాటు 600 గజాల అత్యంత ఖరీదైన ఇంటి స్థలాన్ని ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.