ఆ స్టార్ త్వరలోనే టీమిండియాలోకి తిరిగొస్తాడు: సురేష్ రైనా
భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ తిరిగి జాతీయ జట్టులోకి రావడంపై క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. మహమ్మద్ షమీ త్వరలోనే టీమిండియాలోకి రీ-ఎంట్రీ ఇస్తాడని భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఆశాభావం వ్యక్తం చేశారు. 36 ఏళ్ల వయసులో క్రమశిక్షణ, ఫిట్‌నెస్, నిరంతర శ్రమతో భారత జట్టులోకి తిరిగొచ్చిన భువనేశ్వర్ కుమార్ ప్రయాణాన్ని రైనా ఈ సందర్భంగా ఉదాహరణగా ప్రస్తావించారు.
భువీ బాటలోనే షమీ పయనం
ఇండియన్ సాఫ్ట్‌బాల్ క్రికెట్ లీగ్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సురేష్ రైనా.. భువనేశ్వర్ కుమార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. 36 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్ తలుపులు మళ్లీ తట్టడం సామాన్య విషయం కాదని.. తన ఫిట్‌నెస్, లైన్ అండ్ లెంగ్త్‌పై భువీ చూపిన శ్రద్ధే అతడికి మళ్లీ అవకాశాన్ని తెచ్చి పెట్టిందని సురేష్ రైనా పేర్కొన్నారు. మహమ్మద్ షమీ గురించి మాట్లాడుతూ.. "దేశీయ క్రికెట్లో మహమ్మద్ షమీ అద్భుతంగా రాణిస్తున్నాడు. భువీ రీఎంట్రీ సాధించాడు. ఇప్పుడు షమీ కూడా అదే దారిలో ఉన్నాడు. అతని రీ-ఎంట్రీపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు" అని ధీమా వ్యక్తం చేశారు.

దేశీయ క్రికెట్లో శ్రమిస్తున్న మహమ్మద్ షమీ
మహమ్మద్ షమీ చివరిసారిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున పరిమిత ఓవర్ల మ్యాచ్ ఆడాడు. టెస్టుల్లో అయితే 2021-23 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై చివరిసారిగా బరిలోకి దిగాడు. ఆ తర్వాత నుంచి జాతీయ జట్టులో చోటు పదిలం చేసుకునేందుకు దేశీయ క్రికెట్‌పై దృష్టి సారించాడు. ప్రస్తుతం 2026-27 రంజీ ట్రోఫీ సీజన్లో బెంగాల్ జట్టు తరఫున ఆడుతున్నాడు. అక్కడ మహమ్మద్ షమీ చూపించే బౌలింగ్ ప్రదర్శనే అతడి రీఎంట్రీకి ప్రామాణికంగా మారనుంది.
ఐపీఎల్ ప్రదర్శన.. ముందున్న సవాళ్లు ఇవే..
గత రెండు ఐపీఎల్ సీజన్లలో(2025, 2026) మహమ్మద్ షమీ 22 మ్యాచ్‌లు ఆడి 10 ఎకానమీ రేటుతో 18 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో రీఎంట్రీ సాధించాలంటే దేశీయ క్రికెట్లో నిలకడగా వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఐపీఎల్ 2026లో భువనేశ్వర్ కుమార్ 28 వికెట్లు తీసి ఆర్సీబీ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. భువీ చూపించిన వేగం, స్వింగ్, డెత్ ఓవర్ల కచ్చితత్వమే అతడిని మళ్లీ టీమిండియాలో తెచ్చాయి. అదే బాటలో షమీ కూడా బెంగాల్ తరఫున రాణించి ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటే సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించడం ఖాయం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


