IND vs SL: సరైన ప్రదేశాల్లో బంతిని హిట్ చేయడంతో పాటు మంచి రిథమ్‌తో బౌలింగ్ చేయడమే తన సక్సెస్ సీక్రెట్ అని టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో సంచలన ప్రదర్శన కనబరుస్తున్న షమీ.. రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో షమీ ఆడింది మూడు మ్యాచ్‌లే అయినా 14 వికెట్లతో సత్తా చాటాడు. ఇందులో రెండు సార్లు 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు.
ఇప్పటికే ప్రపంచకప్‌ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్రకెక్కిన షమీ.. అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న బౌలర్‌గా కూడా నిలిచాడు. వన్డే ప్రపంచకప్‌ల్లో ఇప్పటికే మూడు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న షమీ.. మిచెల్ స్టార్క్‌తో సమంగా నిలిచాడు. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో షమీ(5/18) ఐదు వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ సంచలన ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఈ వెటరన్ పేసర్.. తన సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలియజేశాడు. 'నేను ముందుగా అల్లాకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. మా బౌలింగ్ యూనిట్ కష్టానికి ప్రతిఫలమే ఈ సంచలన ప్రదర్శన. జట్టులో ప్రతీ ఒక్కరు ఆటతో పాటు ఇతరుల సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు.
నేను ఎప్పుడూ సరైన ప్రదేశంలో బంతిని హిట్ చేస్తూ.. సరైన రిథమ్‌ను అందుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే పెద్ద టోర్నీలో ఒకసారి రిథమ్ కోల్పోతే తిరిగి అందుకోవడం చాలా కష్టం. కాబట్టి ఆరంభం నుంచే సరైన ప్రదేశంలో, సరైన లెంగ్త్‌ల్లో బంతి వేసేందుకు ప్రయత్నిస్తాను. ప్రపంచకప్‌లో భారత్ తరఫున అథ్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది.
వైట్ బాల్ క్రికెట్‌లో రిథమ్ కోల్పోకుండా సరైన ప్రదేశాల్లో బంతిని హిట్ చేయడం చాలా ముఖ్యం. కొత్త బంతితో సరైన ప్రదేశంలో బంతిని హిట్ చేస్తే పిచ్ నుంచి సహకారం లభిస్తుంది. లెంగ్త్ కూడా ముఖ్యమే. పిచ్ కండిషన్స్ బట్టి లెంగ్త్‌ను అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రేక్షకుల మద్దతు కూడా నేను మరింత కసిగా బౌలింగ్ చేసేలా చేసింది.
ఈ సందర్భంగా నేను ప్రతీ అభిమానికి ధన్యావాదాలు తెలపాలనుకుంటున్నా. విదేశాలకు వెళ్లినప్పుడు కూడా మాకు ప్రేక్షకుల నుంచి మద్దతు లభిస్తోంది. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా బాగుంది.'అని షమీ చెప్పుకొచ్చాడు. వరుసగా ఏడు విజయాలు సాధించిన టీమిండియా.. అధికారికంగా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. తదుపరి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది.