టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ నిప్పులు చెరిగాడు. సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన షమీ.. సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన మహమ్మద్ షమీ.. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రౌండ్-5 మ్యాచ్‌లో 4 వికెట్లతో సత్తా చాటాడు.
ఈ మ్యాచ్‌లో 19 ఓవర్లు బౌలింగ్ చేసి 4 మెయిడిన్ ఓవర్లు వేసిన షమీ.. 54 పరుగులిచ్చి 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఈ నాలుగు వికెట్లలో ముగ్గురు బ్యాటర్లను షమీ క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం. బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగులకు కుప్పకూలింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మధ్యప్రదేశ్ షమీ ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే ఆలౌటైంది. మహమ్మద్ షమీతో పాటు అతని తమ్ముడు మహమ్మద్ కైఫ్, సురజ్ సింధు జైస్వాల్ రెండేసి వికెట్లు తీసారు. రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన బెంగాల్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది.
చీలమండ గాయంతో షమీ గతేడాదిగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అతను చివరిసారిగా గతేడాది నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఆడాడు. చీలమండ గాయంతోనే ఆ టోర్నీలో కొనసాగిన షమీ.. అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆ టోర్నీ ఫైనల్లో భారత్ ఓటమి పాలవ్వగా.. షమీ లండన్ వెళ్లి శస్త్ర చికిత్స తీసుకున్నాడు.
దాంతో గతేడాదిగా ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఇటీవలే గాయం నుంచి పూర్తిగా కోలుకొని ప్రాక్టీస్ ప్రారంభించిన మహమ్మద్ షమీ.. న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్ లేదా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు. కానీ ఈ రెండు సిరీస్‌లకు అతన్ని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు.
ఇటీవలే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో మహమ్మద్ షమీ రిహాబిలిటేషన్ పూర్తి చేసుకొని ఫిట్‌నెస్ టెస్ట్ కూడా పాసయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చే ముందు దేశవాళీ క్రికెట్ ఆడుతానని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. రంజీ ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడి సత్తా చాటి.. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతానని చెప్పాడు.
గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని కూడా స్పష్టం చేశాడు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులోనూ షమీకి చోటు దక్కలేదు. అతని విషయంలో బీసీసీఐ ఆచితూచి అడుగులు వేస్తోంది. తొందరపాటు పడకుండా గాయం పూర్తిగా తగ్గి మ్యాచ్ ఫిట్‌నెస్ సాధిస్తే జట్టులోకి తీసుకోవాలనుకుంటోంది. నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా ఐదు టెస్ట్‌ల బోర్డర గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. రంజీ ట్రోఫీలో షమీ సత్తా చాటడంతో అతను ఆసీస్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతాడని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.