టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ పట్టు వీడటం లేదు. టీమిండియా మేనేజ్‌మెంట్ పట్టించుకోకున్నా.. గాయాలు వేధిస్తున్నా.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్ నుంచి తొలగించినా ఈ బెంగాల్ పేసర్ వెనుకడుగు వేయడం లేదు. మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ సెలెక్టర్లు, టీమిండియా మేనేజ్‌మెంట్‌కు ప్రశ్నలు సంధిస్తున్నాడు. తనలో ఇంకా ఆడే సత్తా ఉందని ఆటతోనే బదులిస్తున్నాడు.
ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ రంజీ ట్రోఫీ 2025-26లో భాగంగా జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన షమీ.. 8 వికెట్లతో సత్తా చాటాడు. చేతికి గాయమైనా.. కట్టు కట్టుకొని మరి ఈ మ్యాచ్ బరిలోకి దిగాడు.
కోల్‌కతాలోని కల్యాణి క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో షమీ కెరీర్ బెస్ట్ ప్రదర్శన కనబర్చాడు. 22.1 ఓవర్లు బౌలింగ్ చేసిన 35 ఏళ్ల షమీ 90 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు తీసాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో షమీ 8 వికెట్లు తీయడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు 97 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన షమీకి 7/79 అత్యుత్తమ రికార్డ్. 2012-13 రంజీ ట్రోఫీలో ఈ ఫీట్ సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 7 ప్లస్ వికెట్లు తీయడం కూడా ఇదే రెండో సారి.

మహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శనతో ఈ మ్యాచ్‌లో బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగాల్ 328 పరుగులకు ఆలౌటైంది. అనంతరం జమ్మూ కశ్మీర్ 302 పరుగులకు కుప్పకూలింది. షమీ ఒక్కడే 8 వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. అయితే బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా 99 పరుగులకే ఆలౌటైంది. దాంతో జమ్మూ కశ్మీర్ ముందు 126 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి జమ్మూ కశ్మీర్ 43/2తో నిలిచింది. ఆఖరి రోజు ఆటలో షమీ చెలరేగితేనే బెంగాల్ గెలవనుంది.
దేశవాళీ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన షమీ.. ఈ సీజన్‌లో 21 మ్యాచ్‌ల్లో 67 వికెట్లు తీసాడు. అయినా సెలెక్టర్లు అతన్ని పట్టించుకోలేదు. 7 రంజీ మ్యాచ్‌ల్లో 36 వికెట్లు తీసిన షమీ.. విజయ్ హజారే ట్రోఫీలో 7 మ్యాచ్‌ల్లో 15, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు.
ఫిట్‌నెస్ సమస్యలతో భారత జట్టుకు దూరమైన షమీ.. మళ్లీ రీఎంట్రీ ఇవ్వలేదు. అతను చివరి సారిగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో ఆడాడు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ తర్వాత ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఎక్కువగా క్రికెట్ ఆడకపోవడం వల్లే షమీని జట్టుకు ఎంపిక చేయడం లేదని అగార్కర్ అప్పట్లో వెల్లడించాడు. కానీ 21 మ్యాచ్‌ల్లో 67 వికెట్లు తీసాడని, ఇప్పటికైనా జట్టులోకి తీసుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.