టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలిపాడు. ప్రస్తుతం గాయం నుంచి 100 శాతం కోలుకున్నానని చెప్పాడు. నొప్పి పూర్తిగా తగ్గిపోయిందని పేర్కొన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023 తర్వాత చీలమండ గాయంతో మహమ్మద్ షమీ భారత జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. లండన్‌లో ఈ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న షమీ.. గతేడాదిగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు.
ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో రిహాబిలిటేషన్ తీసుకుంటున్న షమీ.. అప్‌కమింగ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 కోసం సిద్దమవుతున్నాడు. బౌలింగ్ కూడా మొదలుపెట్టిన షమీ.. అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్ ముగిసిన అనంతరం షమీ.. నెట్స్‌లో బౌలింగ్ చేశాడు.

ఇటీవల అతని ఫిట్‌నెస్‌పై తప్పుడు కథనాలు రాగా.. షమీ ఖండించాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. షమీ గాయం గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. అతని విషయంలో తొందరపాటు లేదని, పూర్తిగా కోలుకున్న తర్వాతే జట్టులోకి తీసుకుంటామని చెప్పాడు. షమీ మోకాలికి వాపు రావడంతో ఆలస్యంగా కోలుకుంటున్నాడని తెలిపాడు.
ఈ క్రమంలో షమీ తన ఫిట్‌నెస్ వస్తున్న వార్తలపై స్పందించాడు. 'నేను నిన్న(ఆదివారం) నెట్స్‌లో బౌలింగ్ చేసి విధానం చాలా సంతోషాన్నిచ్చింది. అంతకు ముందు తక్కువ దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్ చేశాను. ఎందుకంటే ఎక్కువ లోడ్ తీసుకోకూడదనుకున్నాను. కానీ, ఆదివారం నేను పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయాలని డిసైడ్ అయ్యా. 100 శాతం బౌలింగ్ చేశాను.
మంచి ఫలితం వచ్చింది. ప్రస్తుతం 100 శాతం నొప్పి లేకుండా ఉన్నాను. నేను ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తానా? లేదా? అని చర్చిస్తున్నారు. కానీ దానికి ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం నేను నా ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాను. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంత బలంగా ఉండాలనే దానిపై దృష్టిసారించాను.
ఆస్ట్రేలియాలో ఎలాంటి బౌలింగ్ ఎటాక్ అవసరమో నాకు తెలుసు. నాకు మ్యాచ్ ప్రాక్టీస్ కావాలి. అందుకే ముందుగా రంజీట్రోఫీలో కొన్ని మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నాను.'అని మహమ్మద్ షమీ వివరించాడు. నవంబర్ చివరి వారంలో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌కు మహమ్మద్ షమీ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.