Mohammed Shami: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ సంచలన ప్రదర్శనతో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో అత్యుత్తమ గణంకాలు నమోదు చేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో తొలి అవకాశాన్ని అందుకున్న మహమ్మద్ షమీ(5/54) సంచలన బౌలింగ్‌తో నిప్పులు చెరిగాడు.
హార్దిక్ పాండ్యా గాయంతో తుది జట్టులో చోటు దక్కించుకున్న షమీ.. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు 12 ఇన్నింగ్స్‌లు ఆడిన షమీ 36 వికెట్లతో సత్తా చాటాడు. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో 12 ఇన్నింగ్స్‌ల తర్వాత షమీ సాధించిన రికార్డులను మరే బౌలర్ కూడా అందుకోలేదు.

అత్యధిక వికెట్లు, ఎక్కువసార్లు ఐదు వికెట్ల ఘనత అందుకోవడంతో పాటు మెరుగైన యావరేజ్, తక్కువ స్ట్రైక్‌రేట్‌తో బౌలింగ్ చేసిన బౌలర్‌గా మహమ్మద్ షమీ గుర్తింపు పొందాడు.
ప్రపంచకప్ చరిత్రలో 12 ఇన్నింగ్స్‌ల్లో మిచెల్ స్టార్క్ 31 వికెట్లు తీయగా.. లసిత్ మలింగా 26 వికెట్లు తీసారు. ఈ ఇద్దరిని తాజా ఇన్నింగ్స్‌తో షమీ అధిగమించాడు. చివరి మూడు వన్డేల్లో షమీ రెండు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకోవడం విశేషం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. డారిల్ మిచెల్(127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 130) సెంచరీతో చెలరేగగా.. రచిన్ రవీంద్ర(87 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 75) హాఫ్ సెంచరీతో రాణించాడు. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ(5/54) కివీస్ పతనాన్ని శాసించాడు. కుల్దీప్ యాదవ్(2/73) రెండు వికెట్లు తీయగా.. బుమ్రా(1/45), సిరాజ్(1/45) తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ(46), శుభ్‌మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించిన అనంతరం రోహిత్, శుభ్‌మన్ గిల్ 5 పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. ఈ పరిస్థితుల్లో ధాటిగా ఆడిన శ్రేయస్ అయ్యర్(33)ను ట్రెంట్ బౌల్ట్.. షార్ట్ పిచ్ బాల్‌తో బోల్తా కొట్టించాడు. దాంతో భారత్ 128 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.
క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్(18 బ్యాటింగ్), కోహ్లీ(42 బ్యాటింగ్) నిలకడగా ఆడుతున్నారు.