
నా చేతుల్లో మంత్రదండం లేదు..
దీనికి హెచ్‌సీఏ అంతర్గత కుమ్ములాటలే కారణమనే ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే తనపై వస్తున్న విమర్శలు అజార్ ఖండించాడు. 'అజార్ వల్ల కాలేదని కొందరంటున్నారు. నా చేతుల్లో మంత్రదండం లేదు. పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బోర్డు, గవర్నింగ్ కౌన్సిల్ వేదికలను ఖరారు చేశాయి.
ఉప్పల్ స్టేడియానికి అవకాశం లభించడం లేదని వార్తలు వచ్చిన వెంటనే నేను మళ్లీ బోర్డు పెద్దలతో మాట్లాడాను కూడా. హైదరాబాద్‌ను తప్పించిన విషయంలో బోర్డు కూడా అధికారికంగా ఎలాంటి కారణం చూపించలేదు కాబట్టి నాకూ తెలీదు. అయితే ఇప్పటికే ప్రకటించిన వేదికల్లో ఏదైనా కారణం చేత మ్యాచ్‌ల నిర్వహణ సాధ్యం కాకపోతే మన నగరం అందుకు సిద్ధంగా ఉందని నేను చెప్పగలను. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ విషయంలో హామీ ఇచ్చింది' అని అజార్ చెప్పుకొచ్చాడు.

2011 ప్రపంచకప్ టైమ్‌లో..
కొందరు మాజీ క్రికెటర్లు తాజా ఐపీఎల్ వ్యవహారంలో తనను విమర్శిస్తున్నారని, నిజానికి వారి హయాంలో చేసిన తప్పులను ప్రస్తుత కమిటీ దిద్దుకుంటూ వస్తోందని మాజీ కెప్టెన్ అన్నారు. 'ఆర్థికపరమైన బకాయిలు, జరిమానాలు... ఇలా చాలావాటిని మేం సరి చేస్తున్నాం. లేదంటే ఈపాటికి హెచ్‌సీఏ మూత పడేది. ఇన్ని మాటలు చెబుతున్నవారు తాము పదవిలో ఉన్నప్పుడు 2011 వన్డే వరల్డ్ కప్‌లో ఒక్క మ్యాచ్ అయినా తీసుకొచ్చారా' అని ఆయన ప్రశ్నించారు.

కావాలనే తప్పించారు..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్, కార్యదర్శి విజయానంద్ మధ్య ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి. హెచ్‌సీఏలో అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు ఎవరికి వారే అనే తీరులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కనీసం హైదరాబాద్ రంజీ జట్టును సిద్దం చేయడంలోనూ విఫలమయ్యారు. అదే సమయంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లారు. హెచ్‌సీఏలో జరుగుతున్న అంతర్గత రాజకీయాలతో బీసీసీఐ పెద్దలు కూడా విసుగు చెందారు. ప్రొఫెషనల్‌గా నడిపించాల్సిన అసోసియేషన్‌ను రాజకీయ గొడవలకు కేంద్రంగా మార్చారని బోర్డు ఆగ్రహంతో ఉన్నట్లు ఒక అధికారి తెలిపారు. అందుకే, ఐపీఎల్‌ను హైదరాబాద్‌లోనూ నిర్వహించాలని స్వయంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ బహిరంగ ప్రకటన చేసినా బీసీసీఐ పట్టించుకోలేదని సదరు అధికారి స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications












