నా క్రికెట్ జీవితంలో ఆ ఇన్నింగ్స్ మరవలేనిది : భారత మాజీ కెప్టెన్

న్యూఢిల్లీ: తన క్రికెట్ కెరీర్‌లో న్యూజిలాండ్‌పై సాధించిన సునామీ సెంచరీ ఇప్పటీకీ తన మదిలో మెదులుతూనే ఉందని భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ తెలిపాడు. తన 30 అంతర్జాతీయ సెంచరీల్లో 10 నుంచి 12 మాత్రమే గుర్తుకుంటాయని, అందులో న్యూజిలాండ్‌పై చేసిన సెంచరీ మరవలేనిదని ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెప్పుకొచ్చాడు. ఆ రోజు ఇన్నింగ్స్‌లో తనకు పరిస్థితులన్నీ అనుకూలించాయని తెలిపాడు. 1988 డిసెంబరు 17న న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగో వన్డేలో అజర్ (65 బంతుల్లో 108 నాటౌట్) ఆకాశమేహద్దుగా చెలరేగి 62 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.

ప్రత్యక్షప్రసామైనా.. ఆ ఫుటేజ్ లేదు..
కివీస్ బౌలర్లపై విరుచుకు పడుతూ అజార్ సాధించిన శతకం అప్పట్లో వన్డేల్లోనే అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. ఆ మ్యాచ్ దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారమైనా దానికి సంబంధించి ఫుటేజ్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఆ రోజుల్లో దూరదర్శన్‌లో తరచూ లింక్ కట్ అవుతుండేది. భారత్ చేజింగ్‌లో అజర్ బ్యాటింగ్ సమయంలో అదే చోటు చేసుకుంది. దాంతో క్రికెట్ ఫ్యాన్స్‌కు ఆ అద్భుత ఇన్నింగ్స్ చూసే అవకాశం దక్కలేదు. ఆ క్షణాలను అజార్ తాజగా గుర్తు చేసుకున్నాడు.

రెండు సిక్సర్లు మైదానం బయట పడ్డాయి..
‘వడోదరలోని మోతీబాగ్ ప్యాలెస్ గ్రౌండ్‌లో ఆ మ్యాచ్ జరిగింది. ఎండ తగలకుండా ప్రేక్షకులకోసం షామియానాలు వేశారు. ఆ మ్యాచ్‌లో మూడో ,నాలుగో సిక్సర్లు కొట్టా. వాటిలో రెండు గ్రౌండ్ బయటకు వెళ్లాయి. ఒకటేమో చెట్టుకు తగిలింది. ఆ రోజు తప్పులకు తావులేని విధంగా నా బ్యాటింగ్ సాగింది.60 బంతుల్లోనే సెంచరీ చేశాననే విషయం నాకు కూడా తెలియలేదు' అని అజర్ అన్నాడు.

ఆరో స్థానంలో వచ్చి..
కపిల్‌దేవ్‌లేని ఆ మ్యాచ్‌లో భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. సంజీవ్ శర్మ (10 ఓవర్లలో 74), రషీద్ పటేల్ (10 ఓవర్లలో 58), చేతన్ శర్మ (10 ఓవర్లలో 1/54) పరుగులివ్వడంలో పోటీపడి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ‘నాడు 279 రన్స్ చేజ్ చేయడమంటే ఇప్పట్లో 340 పరుగులంత. ఆరోజు నేను ఆరో నెంబర్‌లో బ్యాటింగ్ చేయడం కలిసి వచ్చింది. సరిగ్గా గుర్తులేదు కానీ దిలీప్ భాయ్ (వెంగ్‌సర్కార్) లేదా సంజయ్ మంజ్రేకర్ అవుటయ్యాకో నేను క్రీజులోకి వచ్చా. అజయ్ శర్మ చక్కటి సహకారం అందించాడు. మేం వేగంగా 100 పరుగులకుపైగా భాగస్వామ్యం నెలకొల్పాం' అని 57 ఏళ్ల అజర్ చెప్పాడు. ఆ సిరీ్‌సను వెంగ్‌సర్కార్ కెప్టెన్సీలోని భారత్ 4-0తో నెగ్గింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications