విరాట్ కోహ్లీ బ్రేక్ తీసుకోవడం వల్ల నష్టం లేదు.. కానీ టైమింగే సరిగ్గా లేదు: మహమ్మద్ అజారుద్దీన్

హైదారబాద్: టీమిండియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ప్రెసిడెంట్, భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ స్పందించాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలన్నాడు. వీరి మధ్య విభేధాలు ఉన్నాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరి ప్రవర్తన వాటిని నమ్మేలా ఉందన్నాడు. ఇక వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీని తప్పించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. టీ20 సారథి రోహిత్ శర్మకే వన్డే పగ్గాలు అందించింది. అయితే ఈ నిర్ణయం పట్ల విరాట్ కోహ్లీ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

కోహ్లీ దూరం..
ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి కోహ్లీ ఇప్పటి వరకు స్పందించలేదు. బీసీసీఐ తీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫోన్‌ను కూడా స్విచ్చాఫ్‌లో పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా పర్యటనలోని వన్డే సిరీస్‌కు కోహ్లీ దూరంగా ఉండాలనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కూతురు వామికా బర్త్‌డే సెలెబ్రేషన్స్‌లో పాల్గొనేందుకే విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడని, ఇప్పటికే బీసీసీఐ పెద్దలకు సమాచారమిచ్చాడని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

కూతురి బర్త్‌డే కోసం..
ఈ ఏడాది జనవరి 11న వామికా పుట్టిన విషయం తెలిసిందే. వామికా తొలి బర్త్‌డే నేపథ్యంలో ఫ్యామిలీతో కలిసి విరాట్ హాలిడే ట్రిప్ వెళ్లాలని ప్లాన్ చేసాడట. అయితే మూడు టెస్ట్‌ల సిరీస్ ముగిసిన తర్వాతే ఈ ట్రిప్ ఉంటుందని, దాంతోనే వన్డే సిరీస్ ఆడలేనని కోహ్లీ తెలిపినట్లు సమాచారం. ఇక మూడు టెస్ట్‌ల సిరీస్‌లో చివరి టెస్ట్ జనవరి 11 నుంచి 15వరకు జరగనుంది. వామికా బర్త్‌డే రోజునే చివరి టెస్ట్ ప్రారంభం కానుంది. కానీ టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాతే సెలెబ్రేషన్స్ పెట్టుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే విరాట్ వన్డే సిరీస్ నుంచి దూరమవ్వాలనకుంటున్నాడని స్పష్టంగా అర్థం అవుతుంది.
గాయంతో రోహిత్ ఔట్...
వన్డే కెప్టెన్‌గా, టెస్ట్ వైస్ కెప్టెన్‌గా డబుల్ ప్రమోషన్ అందుకున్న రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడి టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. టీమిండియా త్రో డౌన్స్ స్పెషలిస్ట్ రఘు విసిరిన బంతి రోహిత్ చేతికి బలంగా తాకిందని, అతను సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉందని ఉదయమే వార్తలు షికారు చేశాయి. ఇక సాయంత్రానికి రోహిత్ గాయంపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. అయితే చేతి గాయం పెద్దదేమి కాదని, తొడకండరాలు పట్టేయడంతోనే అతను మూడు టెస్ట్‌ల సిరీస్‌కు దూరమయ్యాడని ట్వీట్ చేసింది.

విభేదాలు నిజమేనని...
టెస్ట్ సిరీస్‌కు రోహిత్.. వన్డే సిరీస్‌కు కోహ్లీ దూరమవుతున్న నేపథ్యంలో అనేక ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఒకరి కెప్టెన్సీలో ఒకరికి ఆడాలనే ఉద్దేశం లేకనే ఇలా చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఈనేపథ్యంలోనే అజారుద్దీన్ ఈ వ్యవహారంపై ట్విటర్ వేదికగా స్పందించాడు. 'వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదని విరాట్ కోహ్లీ ఇప్పటికే సమాచారమిచ్చాడు. ఇక అప్ కమింగ్ టెస్ట్ సిరీస్‌కు రోహిత్ గాయంతో దూరమయ్యాడు. అయితే బ్రేక్ తీసుకోవడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు. కానీ టైమింగే సరైంది కాదు. ఇలా చేయడం వల్ల వీరిద్దరి మధ్య బేధాభిప్రాయాలు నిజమేననే అభిప్రాయం కలుగుతోంది.'అని అజారుద్దీన్ ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications