
న్యూఢిల్లీ: తన ఇగో హర్ట్ అవ్వడంతోనే ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌లో సిక్స్‌లు బాదానని టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ అన్నాడు. ఈ మ్యాచ్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మహమ్మద్ షమీ.. 47 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులు చేసాడు. అక్షర్ పటేల్‌తో కలిసి 9వ వికెట్‌కు 62 పరుగులు జోడించాడు. ఈ భాగస్వామ్యంతో భారత్ 243 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకొని ఇన్నింగ్స్ 132 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఇక 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లాంగాన్‌లో షమీ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను బోలాండ్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో రెచ్చి పోయిన షమీ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.
అయితే ధాటిగా ఆడటానికి గల కారణాన్ని షమీ వెల్లడించాడు. తాజాగా అక్షర్ పటేల్, మహమ్మద్ షమీల మధ్య జరిగిన చిట్‌చాట్‌ను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా అక్షర్.. షమీని పలు ప్రశ్నలు అడగ్గా ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. నెమ్మదిగా ఆడమని చెంబితే సిక్సర్లు ఎందుకు కొట్టావని అక్షర్ అడగ్గా.. నా ఇగో హర్ట్ అయ్యిందని, అందుకే సిక్సర్లు కొట్టానని షమీ బదులిచ్చాడు. 'అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు మరో ఎండ్‌లో బ్యాటింగ్ చేయాలని అనుకున్నా. చాలాసేపు క్రీజులో ఉండాలనే ఉద్దేశంతోనే బ్యాటింగ్‌కు వచ్చా. ఓపిక పట్టాలని అనుకున్నా.. కానీ అది చేయలేకపోయా.' అని షమీ తెలిపాడు.
వెంటనే అక్షర్ మాట్లాడుతూ.. 'నేను ప్రశాంతంగా ఉంటూ.. నెమ్మదిగా ఆడు.. కాస్త సహనం చూపించు... అని చెప్పగానే నువ్వు ఓ సిక్స్ కొట్టావు. మళ్లీ మెల్లిగా ఆడమని చెప్పిన వెంటనే ఇంకో సిక్సర్ బాదావు... ఎందుకు అలాగా?' అని అక్షర్ పటేల్ అడిగాడు. దానికి షమీ.. 'నా ఇగో హర్ట్ అయ్యింది. అందుకే సిక్సర్లు బాదాను.'అని షమీ చెప్పడంతో నవ్వులు పూసాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 177 పరుగులకు కుప్పకూలగా.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసింది. రోహిత్ శర్మ సెంచరీతో రాణించగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీలు బాదారు. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ ఐదు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానుంది.