ఐసీసీ టోర్నీల్లో తమ జట్టు విజయం రహస్యం పెద్దగా అంచనాలు లేకపోవడమే అయితే.. తమను తక్కువ అంచనా వేయడం కొనసాగించాలని క్రికెట్ విశ్లేషకులతో పాటు అభిమానులను పాకిస్థాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ కోరాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బుధవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మహమ్మద్ రిజ్వాన్ పాల్గొన్నాడు. చాలా కూల్‌గా సరదాగా మాట్లాడిన రిజ్వాన్ తమ జట్టు గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పాకిస్థాన్.. అసాధారణ ప్రదర్శనతో విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. చాలా తక్కువ ర్యాంక్‌తో సర్ఫరాజ్ అహ్మద్ సారథ్యంలో ఆడిన పాక్.. ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో పటిష్టమైన భారత్‌ను చిత్తు చేసి టైటిల్ అందుకుంది. 1992 వన్డే ప్రపంచకప్‌లోనూ వరుస పరాజయాలతో చతికిలపడిన పాక్.. ఆ తర్వాత పుంజుకొని ఏకంగా ప్రపంచకప్‌నే అందుకుంది.

అలానే తక్కువ అంచనా వేయండి.. సార్
ఈ క్రమంలోనే అంచనాలు లేకుండా బరిలోకి దిగడమే పాకిస్థాన్ విజయ రహస్యమా? అని మీడియా ప్రతినిథులు ప్రశ్నించగా తనదైన శైలిలో బదులిచ్చాడు. అలా అయితే తమను అనామక జట్టుగానే చూడాలని రిజ్వాన్ కోరాడు. మ్యాచ్ జరిగే రోజు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంపైనే జట్టుగా ఫోకస్ పెట్టామని, మిగతా విషయాలను ఆ దేవుడికే వదిలేసామని తెలిపాడు. 'ఒకవేళ మేం అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగి విజయాలు సాధించి ఉంటే మమ్మల్ని అలానే తక్కువ అంచనా వేయండి. మేం మరోసారి విజేతగా నిలుస్తాం.
కష్టం మాది.. ఫలితం ఆ దేవుడిది
మేం మా బలహీనతలపై ఫోకస్ పెట్టాం. ఓ ఆటగాడిగా మేం మా అవగాహనను మెరుగుపర్చుకోవాలి. మేం మా నైపుణ్యాలను పెంచుకోవాలి. పాకిస్థాన్ గొప్ప విజయాలు సాధించిందనడంలో సందేహం లేదు. మేం అసాధారణమైన ఆటగాళ్లను ప్రపంచానికి పరిచయం చేశాం. ఇప్పుడు కూడా యువ ఆటగాళ్లు నేర్చుకోవడానికి మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ఇతర దేశాల ఆటగాళ్లు కూడా ఇదే చేస్తున్నారు. మ్యాచ్ రోజు మేం బాగా కష్టపడి, మా ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు స్మార్ట్ క్రికెట్ ఆడితే ఆ దేవుడే మనకు ఫలితాన్ని ఇస్తాడని నేను గట్టిగా నమ్ముతాను.
మాకు ఆ దమ్ము ఉంది..
మేం ఎప్పుడూ చెప్పేది ఒక్కటే.. మా జట్టును, మా విధానాన్ని పరిశీలిస్తే.. గత 10 ఏళ్లుగా ఒక్క జట్టు కూడా మా దేశంలో పర్యటించుకున్నా.. మేం అద్భుతమైన విజయాలు అందుకున్నాం. కాబట్టి ఎవరూ కూడా మా నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని, సౌకర్యాలపై డౌట్ పడవద్దు. కొన్నిసార్లు మేం మెరుగైన ప్రదర్శన చేయకపోవచ్చు. మా పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించడంలో విఫలం కావచ్చు. ఇతర జట్లు మా వైఫల్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. కానీ ఈ తప్పిదాలను సరిదిద్దుకోవడానికి, పాకిస్థాన్‌కు అనుకూలమైన ఫలితాలను సాధించేందుకు మేం మరింత కష్టపడుతాం.'అని మహమ్మద్ రిజ్వాన్ చెప్పుకొచ్చాడు.