చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా దిగ్గజం, సీఎస్‌కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టులో ఉన్నన్ని రోజులు రుతురాజ్ గైక్వాడ్ పేపర్ కెప్టెనే అని స్పష్టం చేశాడు. ధోనీ కెప్టెన్‌గా లేకపోయినా జట్టుపై పూర్తి ఆధిపత్యం అతనిదే ఉంటుందన్నాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు సీఎస్‌కే తమ జట్టును ప్రక్షాళన చేసేందుకు సిద్దమైంది. రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా 10 మంది ఆటగాళ్లను సీఎస్‌కే వేలంలోకి వదిలేసింది. ఆటగాళ్ల స్వాప్ ట్రేడ్ డీల్‌తో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, సామ్ కరణ్‌ను రాజస్థాన్ రాయల్స్‌కు ఇచ్చేసి ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్‌ను టీమ్‌లోకి తెచ్చుకుంది. సంజూ శాంసన్ జట్టులోకి వచ్చినా తమ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అని సీఎస్‌కే ప్రకటించింది.

సీఎస్‌కే టీమ్ గురించి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'సీఎస్‌కే టీమ్‌లో ధోనీ పాత్ర ఇంపాక్ట్ ప్లేయర్ కంటే ఎక్కువ. అతను కేవలం బ్యాటింగ్ మాత్రమే చేయడు. షాడో కెప్టెన్‌గా జట్టును నడిపిస్తాడు. ఆటగాళ్లకు గైడెన్స్ ఇస్తాడు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ అతను కూడా ధోనీ సూచనలనే పాటిస్తాడు. పేపర్‌పై రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ కావచ్చు. కానీ ధోనీ మైదానంలో ఉన్నంత వరకు అతనే సారథిగా వ్యవహరిస్తాడు. ధోనీ ఏం చేయగలడనే విషయంపై ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ధోనీ కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే ఆడడు.'అని కైఫ్ స్పష్టం చేశాడు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో ధోనీ కేవలం వికెట్ కీపర్‌గానే కొనసాగాడు. బ్యాటింగ్‌లో కూడా చివర్లో బరిలోకి దిగాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో జట్టుకు దూరమైతే.. ధోనీనే జట్టును నడిపించాడు. కానీ సీఎస్‌కే ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. అప్‌కమింగ్ సీజన్‌లోనూ 44 ఏళ్ల ధోనీ వికెట్ కీపర్ పాత్రనే పోషించే అవకాశం ఉంది.