ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బయోపిక్ తీయాలని టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అన్నాడు. అందుకు అతను పూర్తి అర్హుడని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో హార్దిక్ పాండ్యాను ఘోరంగా అవమానించడంతో పాటు సొంత అభిమానులే టార్చర్ చేశారని గుర్తు చేశాడు. అయినా హార్దిక్ పాండ్యా అద్భుతంగా పుంజుకొని టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడని, యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలిచాడని కైఫ్ కొనియాడాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో రోహిత్ శర్మను కాదని ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని సొంత అభిమానులే తప్పుబట్టారు. మ్యాచ్‌ల సందర్భంగా హార్దిక్ పాండ్యాను ఘోరంగా అవమానించారు. అతనిపై సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన రీతిలో ట్రోలింగ్‌కు పాల్పడ్డారు. ఆ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కూడా దారుణంగా విఫలమై.. పాయింట్స్ టేబుల్‌లో ఆఖరి స్థానంలో నిలిచింది. అయినా హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ అండగా నిలిచింది. అతన్నే సారథిగా కొనసాగించింది.

బయోపిక్ తీస్తే సూపర్ డూపర్ హిట్..
తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్దిక్ పాండ్యాపై కైఫ్ ప్రశంసల జల్లు కురిపించాడు. హార్దిక్ పాండ్యా పునరాగమనం అద్భుతమని, అతని బయోపిక్ తీస్తే కుర్రాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డాడు.'హార్దిక్ పాండ్యా కమ్ బ్యాక్ స్టోరీ అద్భుతం. అతను బాధను తనలోనే ఉంచుకొని ముందుకు సాగాడు. అదో బాధకరమైన ప్రయాణం. సొంత అభిమానులే అతన్ని గేలి చేశారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు.
అది మెంటల్ టార్చర్..
ఒక ఆటగాడు అవమానాల మధ్య ముందుకు సాగడం అంత ఆశామాషి వ్యవహారం కాదు. చాలా బాధగా ఉంటుంది. అవమానాలను ఆటగాడు ఎప్పటికీ మరిచిపోలేడు. ఆటగాళ్లను జట్టులో నుంచి తప్పించండి. కానీ హేళన చేయడం ఏ మాత్రం సరికాదు. అది ఆటగాడిని మెంటల్ టార్చర్‌కు గురి చేస్తోంది. హార్దిక్ పాండ్యా ఈ టార్చర్‌ను అనుభవించాడు. వాటిని అధిగమించి టీ20 ప్రపంచకప్ ఆడాడు. ఫైనల్లో హెన్రీచ్ క్లాసెన్‌ను ఔట్ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ బ్యాట్, బాల్‌తో రాణించాడు.
ఓ సింహంలా పోరాడాడు. అతని బయోపిక్ తీస్తే మాత్రం.. గత 6-7 నెలలుగా అతని జీవితంలో జరిగింది, వాటిని హార్దిక్ పాండ్యా ఎదుర్కొన్న తీరు.. కుర్రాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇన్ని అవమానాలు భరిస్తూ.. ప్రశాంతంగా ఉంటూ.. బలాలను మాత్రమే నమ్ముకొని హార్దిక్ పునరాగమనం చేయడం అమోఘం.'అని కైఫ్ చెప్పుకొచ్చాడు.
ప్లే ఆఫ్స్ చేరుతోంది..
ఐపీఎల్ 2025 సీజన్‌లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరుతుందని కైఫ్ అంచనా వేసాడు. 'హార్దిక్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ కచ్చితంగా ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ చేరుతోంది. ఈసారి ముంబై అభిమానులు హార్దిక్‌కు అండగా ఉంటారు. రోహిత్ శర్మ కూడా మద్దతుగా నిలుస్తాడు. అత్యంత విషమ దశలోనూ హార్దిక్ పాండ్యా రెండు టైటిళ్లు అందుకున్నాడు. ఇది అంత ఈజీ కాదు. కానీ హార్దిక్ అద్భుతంగా పోరాడాడు. అతనికి హ్యాట్సాఫ్'అని కైఫ్ చెప్పుకొచ్చాడు. నిషేధం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపించనున్నాడు.