భారత జట్టులో సూపర్ స్టార్ కల్చర్‌ను అంతం చేయాలని, ఆటగాళ్లంతా సమానేమనని, జట్టు కంటే ఎవరూ గొప్ప కాదని తరుచూ చెప్పే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ నిలదీసాడు. జట్టులో ఆటగాళ్లందర్నీ ఒకేలా ఎందుకు చూడటం లేదని ప్రశ్నించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ఒకలా.. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను మరోలా చూడటం ఏంటని నిలదీసాడు. గంభీర్ పేరు ప్రస్తావించకుండా టీమ్‌మేనేజ్‌మెంట్ తీరును తప్పుబట్టాడు.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వడోదర వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ గాయపడిన సంగతి తెలిసిందే. బౌలింగ్ చేసే సమయంలో పక్కటెముకల్లో నొప్పి వస్తుందని చెప్పడంతో ఫిజియోలు అతన్ని డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం చేశారు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ ఫీల్డింగ్ చేశాడు. అయితే బ్యాటింగ్ సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగాల్సి వచ్చింది. క్రీజులో పరుగెత్తేందుకు కూడా సుందర్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కానీ రాహుల్‌కు అండగా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అయితే గాయపడిన సుందర్‌ను బ్యాటింగ్‌కు ఎందుకు పంపించారని కైఫ్ ప్రశ్నించాడు. సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో మెడనొప్పితో ఇబ్బంది పడిన గిల్‌ను బ్యాటింగ్‌కు పంపని టీమ్‌మేనేజ్‌మెంట్.. సుందర్‌ను మాత్రం ఎందుకు ఆడించారని నిలదీసాడు. గిల్‌ను ఒకలా.. సుందర్‌ను మరోలా చూడటం ఏంటని ప్రశ్నించాడు.
'శుభ్‌మన్ గిల్ గాయపడటం గుర్తుందా? కోల్‌కతా వేదికగా జరిగిన ఆ టెస్ట్ మ్యాచ్‌లో అతను మళ్లీ బ్యాటింగ్ చేయలేదు. అది హై స్కోరింగ్ గేమ్. గిల్ వచ్చి 20, 30 పరుగులు చేసినా భారత్‌కు కలిసొచ్చేదని అప్పుడు అంతా అనుకున్నారు. కానీ అతను బ్యాటింగ్ చేయలేదు. గాయం తీవ్రతరం కాకుండా అతనికి పూర్తి రక్షణ కల్పించేందుకు అలా చేశారు. కానీ సుందర్ విషయంలో మాత్రం ఆ విధానాన్ని వర్తింప జేయలేదు.
నా అభిప్రాయం ప్రకారం ఇది చాలా తప్పు. బంతికి ఒక పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో సుందర్‌కు బదులు కుల్దీప్ యాదవ్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణలో ఒకర్ని బ్యాటింగ్‌కు పంపించాల్సింది. సుందర్‌ను పంపించడం అనివార్యమైనప్పుడే అతన్ని బ్యాటింగ్ పంపించాల్సింది.'అని మహమ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పుకొచ్చాడు.
సైడ్ స్ట్రెయిన్ గాయంతో సుందర్ ఈ సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లకు దూరం కాగా.. అతని స్థానంలో సెలెక్టర్లు ఆయుష్ బదోనిని ఎంపిక చేశారు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన బదోని ఎక్స్‌ట్రా బౌలర్‌గా కూడా జట్టుకు సేవలు అందించగలడు. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బదోని.. గతేడాదే భారత్-ఏ తరఫున బరిలోకి దిగాడు.