కోచ్‌గా గంభీర్.. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఫెయిల్! విరుచుకుపడ్డ మహమ్మద్ కైఫ్
శ్రీలంకతో రెండో టెస్ట్‌ను డ్రా చేసుకున్న టీమిండియాపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్ విజయానికి అడ్డుగా నిలిచిన సోనాల్ దినుషా బలహీనతను పసిగట్టడంలో జట్టు మొత్తం విఫలమైందని మండిపడ్డాడు. ఇదేం కబ్ల్ మ్యాచ్ కాదని, డేటా అనలిస్ట్, కోచ్‌లు ఏ చేస్తున్నారని ప్రశ్నించాడు. సోనాల్ దినుషాను ఔట్ చేసే విషయంలో కోచ్‌గా గంభీర్.. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ విఫలమయ్యారని అభిప్రాయపడ్డాడు.
కొలంబో వేదికగా గురువారం ముగిసిన రెండో టెస్ట్‌లో సోనాల్ దినుషా అజేయ శతకంతో శ్రీలంక ఓటమి నుంచి గట్టెక్కింది. మరోవైపు సునాయసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌ను భారత్ చేజేతులా చేజార్చుకుంది. ఆఖరి రోజు ఆటలో నలుగురు బ్యాటర్లను ఔట్ చేయలేక మూల్యం చెల్లించుకుంది.

ఒక్కడిని ఔట్ చేయలేకపోయారు..
ఈ మ్యాచ్ ఫలితంపై అధికారిక బ్రాడ్‌కాస్టర్ సోటీ టీవీ షోలో మాట్లాడిన కైఫ్.. గిల్‌సేనపై ఘాటు విమర్శలు చేశాడు. 'ప్రతీ బ్యాటర్‌కు ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని కనుగొనడంలో భారత్ విఫలమైంది. నేను కేవలం శుభ్‌మన్ గిల్‌ను మాత్రమే నిందించడం లేదు. సోనాల్ దినుషా బలహీనతను పసిగట్టడంలో బౌలింగ్ విభాగంతో పాటు కోచింగ్ సిబ్బంది దారుణంగా విఫలమైంది. అతను గాలే టెస్ట్‌లోనే సెంచరీ చేశాడు. కాబట్టి అతన్ని ఔట్ చేసేందుకు పకడ్బందీ ప్రణాళికల గురించి చర్చ చేయాలి కదా?
ఈ టెస్ట్‌లో వ్యూహాత్మకంగా టీమిండియా బలహీనంగా కనిపించింది. అటాకింగ్ ఫీల్డ్ సెటప్ చేయలేదు. ఫీల్డింగ్‌ను ఓపెన్‌గా పెట్టారు. ఒక్క డ్రైవ్ షాట్ బాల్ కూడా వేయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ తర్వాత డ్రైవ్ బాల్‌తోనే సోనాల్ దినూషాను సారాన్ష్ జైన్ ఔట్ చేశాడు. కానీ ఈ విషయాన్ని భారత బౌలర్లు మరిచిపోయారు. మహమ్మద్ సిరాజ్ ఫుల్ బాల్ వేసినా అతను తెలివిగా వదిలేసాడు. అతను షాట్లు ఆడటానికి ఏ మాత్రం ఇష్టపడలేదు.
కోచ్‌లు ఏం చేస్తున్నారు..?
ఇక ఇదేం క్లబ్ మ్యాచ్ కాదు. ఇంటర్నేషనల్ గేమ్. జట్టులో ఒక వీడియో అనలిస్ట్, డేటా ఎక్స్‌పర్ట్, ఆరు నుంచి ఏడుగురు కోచ్‌లు ఉన్నారు. సోనాల్ దినూషాను ఔట్ చేసే ప్రణాళికలు రచించకుండా వీరంతా ఏం చేస్తున్నారు..? భారత యువ బౌలర్లకు ఇలాంటి పిచ్‌పై ఆడిన అనుభవం లేదు. టెస్ట్‌ల్లో వారు ఐదో రోజు ఎక్కువగా బౌలింగ్ చేయలేదు. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్‌లు ఇంత సుదీర్ఘంగా ఎక్కువగా జరగవు. దాంతోనే ఏం చేయాలో భారత బౌలర్లకు అర్థం కాలేదు. అంతేకాకుండా సోనాల్ దినుషాను భారత జట్టు పెద్దగా పట్టించుకోలేదనే విషయం అర్థమవుతుంది.
తొలి టెస్ట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన తర్వాత కూడా సోనాల్ దినూషాను లైట్ తీసుకున్నారు. రెండో మ్యాచ్‌లోనూ అదే పొరపాటు చేశారు. రెండో టెస్ట్‌లో అతను ఒక్క కవర్ డ్రైవ్ బౌండరీ సాధించలేదు. పుల్, స్వీప్, రివర్స్ స్వీప్ షాట్స్ మాత్రమే ఆడాడు. కానీ ఒక్క కవర్ డ్రైవ్ షాట్ ఆడలేదు. అతను ఆ షాట్ ఆడేలా భారత బౌలర్లు కూడా బంతులు వేయలేదు. షార్ట్ పిచ్ బాల్స్ వేసి పరుగులు సమర్పించుకున్నారు.'అని మహమ్మద్ కైఫ్ అసహనం వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


