టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ప్రశంసల జల్లు కురిపించాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కంటే కోహ్లీనే అత్యుత్తమ బ్యాటర్ అని తెలిపాడు. ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌లో కోహ్లీకి తిరుగులేదని చెప్పాడు. అతని గణంకాలను చూస్తేనే ఈ విషయం స్పష్టమవుతుందన్నాడు. అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లీ.. కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా ఈ ఇద్దరూ ఈ ఫార్మాట్‌లో కొనసాగుతున్నారు. వన్డే ప్రపంచకప్ అందించి సగర్వంగా ఆటకు వీడ్కోలు పలకాలని భావిస్తున్నారు.
రోహిత్ శర్మ దూకుడుకు పెట్టింది పేరైతే.. విరాట్ కోహ్లీ నిలకడకు నిలువెత్తు నిదర్శనం. అయితే వన్డే ఫార్మాట్‌లో రోహిత్ కంటే విరాట్ కోహ్లీ ఎప్పటికీ ఓ అడుగు ముందుంటాడని కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా పేర్కొన్నాడు.

'విరాట్ కోహ్లీ తనకు లభించిన ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మారుస్తాడు. అతను ఒకవేళ 30, 40 పరుగులు సాధించాడంటే చివరి వరకు క్రీజులో పాతుకుపోయి మ్యాచ్‌ను గెలిపిస్తాడు. అతను ఫామ్‌లో ఉంటే నిలకడగా పరుగులు చేస్తాడు. ఈ కారణంగానే విరాట్ కోహ్లీ వన్డేల్లో ఎప్పటికీ రోహిత్ శర్మ కంటే ఓ అడుగు ముందుంటాడు.'అని కైఫ్ చెప్పుకొచ్చాడు.
రోహిత్ శర్మ తన వన్డే కెరీర్‌లో ఇప్పటి వరకు 281 మ్యాచ్‌లు ఆడి 49 యావరేజ్‌తో 11566 పరుగులు చేశాడు. ఇందులో 33 సెంచరీలతో పాటు 61 హాఫ్ సెంచరీలున్నాయి. అయితే మరే బ్యాటర్‌కు సాధ్యం కానీ 3 డబుల్ సెంచరీలను రోహిత్ నమోదు చేశాడు. విరాట్ కోహ్లీ 310 వన్డే మ్యాచ్‌ల్లో 58.45 సగటుతో 14673 పరుగులు చేశాడు. ఇందులో 53 సెంచరీలతో పాటు 77 హాఫ్ సెంచరీలున్నాయి.
తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో విరాట్ కోహ్లీ తొలి వన్డేలో 93 పరుగులతో రాణించాడు. రెండో వన్డేలో మాత్రం 23 పరుగులతో విఫలమయ్యాడు. రోహిత్ శర్మ రెండు మ్యాచ్‌ల్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఆదివారం మూడో వన్డే ఇండోర్ వేదికగా జరగనుంది.